ఎంపీ యూ టర్న్ తీసుకున్నారా ?

Update: 2022-02-08 07:30 GMT
రాజీనామా చేసే విషయంలో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు యూ టర్న్ తీసుకున్నట్లే ఉన్నారు. మొన్నటి వరకు తాను రాజీనామా ఎప్పుడు చేసేది ఫిబ్రవరి 5వ తేదీన ప్రకటిస్తామని చెప్పిన ఎంపి తాను ఎప్పుడు ఆ మాట అనలేదని తాజాగా చెప్పారు. తనపై అనర్హత వేటు వేయించటం తన వల్ల కాదని, తననే రాజీనామా చేసేయమని స్వయంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడిగితే అప్పుడు రాజీనామా చేస్తానని మెలిక పెట్టారు.

తాజాగా పెట్టిన మెలికతోనే రఘురాజ ఎంపీ పదవికి రాజీనామా చేయటం లేదని అర్ధమైపోతోంది. నిజంగానే రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో గెలిచేంత సత్తా ఉండుంటే ఎప్పుడో రాజీనామా చేసుండేవారే అని వైసీపీ నేతలు అంటున్నారు. అంతేకానీ అనర్హత వేటు వేయించలేకపోయాం కాబట్టి బాబ్బాబు రాజీనామా చేసేయమని ఎంపీని జగన్  బతిమలాడుకుంటారా ? అది జరిగే పని కాదని తెలిసే ఎంపీ ఇలాంటి  మాటలు మాట్లాడుతున్నారు.

 తన రాజీనామా ప్రకటనపై ముందు ఫిబ్రవరి 5వ తేదీ అని స్వయంగా ఎంపీయే డెడ్ లైన్ పెట్టారు. తర్వాత ఆయనే మే 11వ తేదీ అన్నారు. మళ్ళీ కాదు కాదు ఫిబ్రవరి 5వ తేదీనే ప్రకటించేస్తానని ఎంపీ చెప్పారు. ఇపుడేమో తన రాజీనామాకు, జగన్ కు ముడిపెడుతున్నారు. అసలు ఎంపీని రాజీనామా చేయమని వైసీపీ నేతలు కాకుండా ఎవరడిగారు ?  తాను రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని ఎంపీకి అనుమానం వచ్చిందా?. అందుకనే ఇలాంటి కండీషన్లన్నింటినీ పెడుతున్నారా అన్నది కూడా ఒక డౌటు.

నియోజకవర్గాన్ని వదిలేసి ఎంపీ రెండేళ్ళుగా ఢిల్లీలోనే కూర్చున్నారు. అక్కడి నుండే జగన్ను టార్గెట్ చేసుకుని  విమర్శలు చేస్తున్నారు.  రోజూ మీడియా తో మాట్లాడుతున్నారు. అలాగే మరో రెండేళ్ళు కంటిన్యు చేస్తే సరిపోతుందనుకుంటున్నారా?. ఇప్పటికిప్పుడు రఘురాజు రాజీనామా చేసినా వచ్చేది లేదు పోయేది లేదు.

ఉపఎన్నికలొస్తే కొద్ది రోజులు అదో గొడవ మళ్ళీ. దాని బదులు హాయిగా ఢిల్లీలోనే  కూర్చుని ప్రభుత్వం+జగన్ పై తాను చేయదలచుకున్న ఆరోపణలు, విమర్శలను కంటిన్యు చేస్తుంటే సరిపోతుంది అనుకున్నారేమో.  గెలవకపోతే మళ్లీ కేసులతో ఇరికిస్తారేమో అన్న భయం వల్ల ఇలా చేశాడా అన్న అనుమానం కూడా పెరుగుతోంది.
Tags:    

Similar News