వీర్రాజు అస్సలు తగ్గట్లేదుగా ?

Update: 2021-03-07 08:30 GMT
ఒకవైపు జనాలు కేంద్రప్రభుత్వాన్ని వాయించేస్తున్నారు. డైరెక్టుగా నరేంద్రమోడి విధానాలపైన దుమ్మెత్తి పోస్తున్నారు. రాష్ట్రప్రయోజనాల విషయంలో కేంద్ర వైఖరి విషయంలో జనాల్లో బాగా వ్యతిరేకత వచ్చేస్తోంది. అయినా బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు. కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం తామే అంటు ఒకటే ఊదరగొట్టారు.

జగన్ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందంటూ ఏకంగా తొడకొట్టారు. కడప అభివృద్ధికి మోడి సర్కార్ మంజూరు చేసిన  వందల కోట్ల రూపాయలు ఏమయ్యాయంటూ జగన్ను నిలదీశారు. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం చేపట్టలేదన్నారు. రాష్ట్రాభివృద్ధికి మోడి సర్కార్ ఇస్తున్న నిధులు గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదని చెప్పటమే విచిత్రంగా ఉంది.

నిజానికి తెలుగురాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీకి కూడా షేర్ ఉంది. అయితే ఆ విషయాన్ని చెప్పుకోవటంలో తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఫెయిలవుతున్నారు. అందుకనే కేసీయార్ ఎక్కడ మాట్లాడినా తెలంగాణాలో జరిగిన మొత్తం అభివృద్ది గడచిన ఏడేళ్ళల్లో జరిగినట్లు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. ఇక ఏపి విషయానికి వస్తే కాంగ్రెస్+టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి కనబడుతుంది. అయితే ఈ అభివృద్ధికి 2014-19 కాలం మినహాయింపనే చెప్పాలి.

2019 ఎన్నికల్లో అదికారంలోకి వచ్చిన జగన్ సంక్షేమపథకాల పైన ఎక్కువ దృష్టి పెట్టారు. ఏదో పోలవరంతో పాటు కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు నడుస్తున్నాయంతే. నిజానికి కేంద్రం మద్దతుండుంటే రాష్ట్రంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలే జరిగుండాలి. మద్దతు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రయోజనాలను మోడి సర్కార్ బాగా దెబ్బ కొడుతోంది. తాజాగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరి ప్రైవేటీకరణ అందరికీ తెలిసిందే.

వాస్తవం ఇలాగుంది కాబట్టే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలను జనాలు వాయించేస్తున్నారు. వైజాగ్ లో ప్రచారం చేసినపుడు జనాలడిగిన ప్రశ్నలకు వీర్రాజు దగ్గర సమాధానం లేకపోయింది. ఒక్క వైజాగే కాదు గుంటూరు, విజయవాడ, కర్నూలు లాంటి అనేక నగరాల్లో కూడా జనాల్లో వ్యతిరేకత స్పష్టంగా బయటపడుతోంది. ఇక ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటిల్లో కనీసం సగం వార్డుల్లో కూడా పోటీ చేయలేని బీజేపీ నేతలు జగన్ను సవాలు చేయటమే విచిత్రంగా ఉంది.
Tags:    

Similar News