గెలుపు కోసం ట్రంప్ అంతలా ప్రయత్నించారా?

Update: 2021-01-04 04:05 GMT
ఈ మధ్యనే ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేశాయో తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ట్రంప్ విశ్వ ప్రయత్నాలే చేశారు. అమెరికా అధ్యక్షుడిగా తనకున్న హోదాను సైతం వాడేసేందుకు ఆయన వెనుకాడలేదు. గెలుపు కోసం ఆయన పడిన కక్కుర్తి ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని తెలియజేసే కొత్త ఆధారం తెర మీదకు వచ్చి సంచలనంగా మారింది. ఓటమిని జీర్ణించుకోలేని ఆయన.. గెలుపు కోసం తనకున్న అన్ని మార్గాల్ని వెతకటమే కాదు.. చివరకు తానే నేరుగా లైన్లోకి వెళ్లి.. ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు సైతం వెనుకాడకపోవటం గమనార్హం.

ఎన్నికల్లో ఫలితాలు తనకు ప్రతికూలంగా వచ్చిన నేపథ్యంలో జార్జియా ఎన్నికల అధికారిపై ఒత్తిడిని పెంచుతూ ఫోన్ లో సంభాషించిన ఆడియో క్లిప్ తాజాగా బయటకు వచ్చింది. బైడెన్ గెలుపును రద్దు చేయాలని.. తనకు ఓట్లు తెచ్చిపెట్టాలని కోరారు. అయితే.. అందుకు సదరు అధికారి అంగీకరించకపోవటంతో ఆయన వేసిన ఎత్తు పారలేదు. మరికొద్ది రోజుల్లో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న వేళ..గెలుపు కోసం ట్రంప్ పడిన కక్కుర్తి ప్రపంచానికి తెలిసేలా ఒక ఆడియో క్లిప్ బయటకు వచ్చింది.

బైడెన్ గెలుపును అంగీకరించకపోవటం.. ఆయన ఎన్నికను సవాలు చేస్తూ పలు కోర్టుల్లో పిటిషన్లు వేసినప్పటికీ.. ఆయన ఎత్తులు పారలేదు. ఇప్పటివరకు ట్రంప్ ప్రయత్నాల్ని ఒక కోణంలో చూసిన వారికి.. తాజాగా బయటకు వచ్చిన ఆడియో క్లిప్ షాకింగ్ గా మారింది.  బైడెన్ విజయాన్ని రద్దు చేయాలని జార్జియాకు చెందిన ఎన్నికల అధికారిని ఒత్తిడి చేయటం.. అది సాధ్యం కాకపోవటంతో.. తనకు అనుకూలంగా ఉన్న ఓట్లను వెతకాలని ఆయన సూచన చేయటం సదరు టేపులో ఉంది.

ఈ ఆడియో టేపును ప్రముఖ మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్టు ఆన్ లైన్ లో విడుదల చేయగా.. ఈ ఆడియో టేపును అసోసియేటెడ్ ప్రెస్ దక్కించుకుంది. తనకు 11780 ఓట్లు కావాలని.. జార్జియా అధికారి బ్రాడ్ తో ట్రంప్ మాట్లాడినట్లుగా ఉంది. ‘జార్జియాలో మనం విజయం సాధించాం. నాకు ఆ ఓట్లు కావాలి’ అన్నట్లుగా ఆడియోలో రికార్డు అయ్యింది. ఇదిప్పుడు సంచలనంగా మారింది.

మరో ట్విస్టు ఏమంటే.. ఈ టేపు బయటకు రావటానికి కాస్త ముందు ట్రంప్ మాట్లాడుతూ.. ఎన్నికల వేళలో తాను జార్జియా సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ తో మాట్లాడినట్లుగా పేర్కొన్నారు. ఏమైనా ఎన్నికల్లో విజయం కోసం ట్రంప్ పడిన ఆరాటం మాత్రం చరిత్రలో మిగులుతుంది. అంత ప్రయత్నం చేసినా.. ప్రజాభిప్రాయం మాత్రం ఆయనకు భిన్నంగా రావటం కూడా గుర్తుండిపోతుంది.
Tags:    

Similar News