మోడీకి నచ్చని నేతకు కీలక బాధ్యతలు అప్పజెప్పిన దీదీ

Update: 2021-03-15 12:52 GMT
ఒకప్పుడు బీజేపీ అన్నంతనే వాజ్ పేయ్.. అద్వానీ.. మురళీమనోహర్ జోషి.. ఇలా చెప్పుకుంటూ పోతే పలువురు నేతలు కనిపిస్తారు. ఇప్పుడు అదే ప్రశ్నను సంధిస్తే.. మోడీ.. అమిత్ షా.. రాజ్ నాథ్ సింగ్ తర్వాత పేర్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. దీనికి కారణం గతంలో ఎప్పుడూ లేనంతగా బీజేపీ మొత్తం మోడీషాల చుట్టూనే తిరగటమే. మోడీని అభిమానించి.. ఆరాధించే వర్గం ఉన్నట్లే.. ఆయన పొడ గిట్టని వర్గం మరొకటి ఉంది. అందులో మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా లాంటి వారు ఉంటారు.
వాజ్ పేయ్ సర్కారులో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన యశ్వంత్ సిన్హాకు.. మోడీషాలకు పెద్దగా పడదు. పార్టీలో ఉంటూ మోడీని బాహాటంగానే విమర్శించే అలవాటున్న ఆయన.. తర్వాతి కాలంలో పార్టీ నుంచి బయటకు వచ్చేయటం తెలిసిందే. ఇటీవల టీఎంసీలో చేరిన ఆయనకు తాజాగా దీదీ కీలక బాధ్యతల్ని అప్పజెప్పారు. పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి సుబ్రతబక్షి వెల్లడించారు. తాజాగాజరుగుతున్న ఎన్నికల్లో యశ్వంత్ సిన్హా సేవల్ని పార్టీ వినియోగించుకునేందుకు వీలుగా ఆయనకు తాజా బాధ్యతల్ని అప్పజెప్పినట్లుగా చెబుతున్నారు.

నందిగ్రామ్ లో సీఎం మమతపై దాడి జరిగిన నేపథ్యంలో.. యశ్వంత్ కు కీలక బాధ్యతలు అప్పజెప్పటం ద్వారా పార్టీలో ఆయన చురుకైన పాత్ర పోషించనున్నట్లు చెబుతున్నారు. మోడీ బలాలు.. బలహీనతలు బాగా తెలిసిన యశ్వంత్ మమత పక్కన చేరటం బీజేపీకి కాస్త ఇబ్బంది కలిగించే అంశంగా చెబుతున్నారు. ఇప్పటికే టీఎంసీ నుంచి పెద్ద ఎత్తున వసల్ని ప్రోత్సహిస్తున్న కమలనాథుల్నియశ్వంత్ కంట్రోల్ చేసే వీలుందని చెబుతున్నారు.

అంచనాలకు తగ్గట్లే.. యశ్వంత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బెంగాల్ లో గెలుపు కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందన్న ఆయన వ్యాఖ్య ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాజ్ పేయ్ హయాంలో బీజేపీ ఏకాభిప్రాయాన్ని నమ్మిందని.. నేటి ప్రభుత్వం అణిచివేత.. బలప్రయోగంతో జయించాలని నమ్ముతుందన్నయశ్వంత్ మాటలు మోడీకి ఇబ్బంది కలిగించటం ఖాయమని చెప్పాలి. మోడీకి సూపర్ సీనియర్ మాత్రమే కాదు.. ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేయటానికి అవసరమైన అన్ని హంగులున్న యశ్వంత్ రానున్న రోజుల్లో మమతకు పెద్ద ఆయుధంగా మారతారన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.




Tags:    

Similar News