ఈ ఫిగర్ చెబితే అడ్డంగా బుక్ అవుతానని కేటీఆర్ కు తెలీదా?

Update: 2022-10-20 06:48 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు మంత్రి కేటీఆర్. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాన్ని చెప్పారు. ఆయన మాటల్ని చూస్తే..

ఎంతో డెవలప్ అవుతున్నట్లు చెప్పే తెలంగాణ నిజంగానే డెవలప్ అవుతోందా? ప్రజల్ని పాలించే పాలకులు తప్పించి.. ప్రజలు ఇప్పటికి పేదరికంలోనే ఉన్నారా? వారిని ఎప్పటికి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగానే ఉంచేయాలన్నదే లక్ష్యమా? ఇలాంటిది ఒక్క మునుగోడుకేనా? తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి? లాంటి బోలెడన్ని సందేహాలు రాక మానవు.

ఇంతకీ మంత్రి కేటీఆర్ ఏం చెప్పారన్నది ఆయన మాటల్లోనే మొదట చెప్పేస్తే మిగిలిన విషయాల్ని తర్వాత చూడొచ్చు. 'మునుగోడులో ఓటర్లు 2.41 లక్షల మంది. వీరిలో రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్థిదారుల 2,38,915 మంది. అంటే 99.1 శాతం మందికి ప్రభుత్వ సాయం అందుతుంది. వీరిలో 1.46 లక్షల మందికిరైతు బంధు.. 39 వేలకు పైగా ఆసరా.. 37 వేలకు పైగా కేసీఆర్ కిట్.. కల్యాణ లక్ష్మి ఎనిమిదిన్నర వేలు.. గొర్రెల పంపిణీ 5,370 మంది. మిగిలిన వారితో కలిపి ఏకంగా 2.38 లక్షలకు పైనే' అని చెబుతున్నారు కేటీఆర్.

ఇక్కడ సూటి ప్రశ్నేమంటే.. ఒక నియోజకవర్గంలోని ఓటర్లలో 99.1 మంది ప్రభుత్వ పథకాన్ని తీసుకునేటోళ్లే ఉంటే.. రాష్ట్రం ముందుకు వెళుతున్నట్లా? వెనక్కి వెళుతున్నట్లా? నిత్యం ప్రభుత్వ పథకాల మీదనే ఆధారపడితే.. వారి సంగతి చూడాలా? రాష్ట్రంలోని మౌలిక వసతుల మాటేమిటి? ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఒక్క మునుగోడులోనే ఉందా? లేదంటే రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితా? అన్న ప్రశ్నలు ఇప్పుడు కేసీఆర్ సర్కారుకు ఎదురు కావటం ఖాయమంటున్నారు.

ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో నిధుల జడివాన కురవటం.. ఓటర్లను ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం చేయటం లాంటివి ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. అదెంత నిజమన్న విషయాన్ని కేటీఆరే ఒప్పుకున్న పరిస్థితి. ఓటర్లను ప్రభుత్వ పథకాల లబ్థిదారులుగా మార్చేసి.. ఓట్లు గుద్దించేసుకునే వైనం బాగానే ఉన్నా.. దీర్ఘకాలంలో ఇదే ప్రగతికి అడ్డంకిగా మారుతుందన్న వాస్తవాన్ని కేటీఆర్ అండ్ కో ఎప్పటికి గుర్తిస్తారో?

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News