మోదీపై షా అస‌హ‌నం..? ఎన్నిక‌ల ఫ‌లితాలు పెట్టిన చిచ్చు..!

Update: 2019-10-28 10:41 GMT
కేంద్రంలో రాజ‌కీయ చ‌క్రం తిప్పుతున్న కీల‌క నేత‌లుగానే కాకుండా పొలిటిక‌ల్ ద్వ‌యంగా కూడా కొన్ని ద‌శాబ్దాలుగా క‌లిసి ఉన్న బీజేపీ నేత‌లు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ - కేంద్ర హోం మంత్రి అమిత్ షాల మ‌ధ్య రాజకీయ చిచ్చురేగిందా?  వారిద్ద‌రి మ‌ధ్య విభేదాలు మొద‌ల‌య్యాయా? అంటే.. ఢిల్లీ వ‌ర్గాలు ఔన‌నే అంటున్నాయి. ఇటీవ‌ల రెండు రాష్ట్రాల ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ హోరు - జోరు పెరుగుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. రెండో సారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావ‌డం - మెజారిటీ కూడా పెర‌గ‌డంతో దేశ‌వ్యాప్తంగా మోదీ హ‌వా పెరుగుతోంద‌ని అంద‌రూ అనుకున్నారు.

అయితే, అనూహ్యంగా బీజేపీ హ‌వా త‌గ్గింది. అత్యంత కీల‌క‌మైన మ‌హారాష్ట్ర‌లో సొంత‌గా అధికారంలోకి వ‌ద్దామ‌ని బీజేపీ నాయ‌కులు ముఖ్యంగా పార్టీ సార‌థి.. అమిత్ షా వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌హారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ తో ఆయ‌న ప‌లు మార్లు భేటీ అయి టికెట్ల కేటాయింపు నుంచి కూడా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అదేవిధంగా మ‌రో కీల‌క రాష్ట్రం - ఢిల్లీ అంచుల్లో ఉండే హ‌రియాణా లోనూ ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇక్క‌డ కూడా తిరిగి అధికారం నిలబెట్టుకోవ‌డం - పార్టీని పుంజుకొనేలా చేయాల‌ని షా భావించారు. అయితే, తాజా ఎన్నిక‌ల్లో ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఊహించిన దానిక‌న్నా.. ఫ‌లితాలు తారుమార‌య్యాయి.

అదే స‌మ‌యంలో బీజేపీ ఓట్ల శాతం త‌గ్గి.. సీట్ల‌పై ప్ర‌భావం చూపించింది. ఈ ప‌రిణామంతో బీజేపీపై జాతీయ స్థాయిలో చ‌ర్చ న‌డుస్తోంది. అయితే, ఇప్పుడు ఈ ప‌రిణామ‌మే ప్ర‌ధాని మోదీ - షాల మ‌ధ్య దూరం పెంచుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గుజ‌రాత్‌ లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ద‌గ్గ‌ర నుంచి ఈ ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం ఉంది. రాజ‌కీయంగా వీరి వ్యూహాల‌కు ప్ర‌తిప‌క్షాలు చిత్త‌యిన సంద‌ర్భాలు కూడా చూస్తున్నాం. అయితే, తాజాగా రెండు రాష్ట్రాల ఎన్నిక‌ల్లోనూ బీజేపీ పుంజుకునేలా - సొంతంగా  ఎవ‌రిపైనా ఆధార‌ప‌డకుండా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌న్న షా వ్యూహానికి మోదీ అడ్డు ప‌డ్డార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

``ఈ రెండు రాష్ట్రాల్లోనూ అంతా నేనే చూసుకుంటాను.``అని షాతో మోదీ వ్యాఖ్యానించార‌ని - అదే స‌మయంలో షా వ్యూహాత్మ‌కంగా ఏర్పాటు చేసుకున్న స‌భ‌ల సంఖ్య‌ను కూడా త‌గ్గించార‌ని అంటున్నారు. ఇక‌, షా కీల‌క రాజ‌కీయ వ్యూహం.. జ‌మిలి ఎన్నిక‌ల విష‌యాన్ని కూడా మోదీ ప‌ట్టించుకోవ‌డం లేదని - అందుకే మ‌హారాష్ట్ర‌ - హ‌రియాణాల్లో ఎన్నిక‌లు వ‌చ్చాయ‌ని ఈ ప‌రిణామ‌మే షా లో అస‌హ‌నం పెంచేందుకు అవ‌కాశం ఇచ్చింద‌ని ఢిల్లీ వ‌ర్గాలు అంటున్నాయి. మ‌హారాష్ట్రలో 10 శాతం - హ‌రియాణాలో 25 శాతం ఓట్లు త‌గ్గ‌డానికి మోదీ అనుస‌రించిన వైఖ‌రే కార‌ణ‌మ‌ని షా భావిస్తున్న‌ట్టు ఈవ‌ర్గాలు చెబుతున్నారు. ఈ ప‌రిణామ‌మే ఇప్పుడు షాకు - మోదీకి మ‌ధ్య చిచ్చు పెడుతోంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News