క‌ర్నూలు టీడీపీకి క‌ష్టాలు.. ఇలా అయితే.. క‌ష్టమే బాబూ!

Update: 2021-08-27 02:30 GMT
రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల్లో టీడీపీకి గ‌ట్టి ప‌ట్టున్న జిల్లా క‌ర్నూలు. ఇక్క‌డ పార్టీకి కీల‌క‌మైన నాయ కులు ఉన్నారు. పైగా.. కీల‌క‌మైన నేత‌లు.. పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపించిన వారు  ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా రెండు త‌రాలుగా టీడీపీలో ఉన్న నాయ‌కుల కుటుంబాలు కూడా ఉన్నాయి. కేఈ కృష్ణ‌మూర్తి, భూమా కుటుంబాలు.. దీనికి ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌. అంతేకాదు.. గ‌త ఎన్నిక‌లకు ముందు వ‌ర‌కు పార్టీలో ఉన్న నేత‌లు కూడా ద‌శాబ్దాలుగా టీడీపీ త‌ర‌ఫున వాయిస్ వినిపించారు. అయితే.. ఇలాంటి జిల్లాలో ఇప్పుడు టీడీపీ ప‌రిస్థితి ఇబ్బందుల్లో ప‌డింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో కేఈ కుటుంబం నుంచి మాజీ రెవెన్యూ మంత్రి, డిప్యూటీ సీఎంగా కూడా వ్య‌వ‌హ‌రించిన కృష్ణ‌మూర్తి కుమారుడు.. శ్యామ్‌బాబు ఎమ్మెల్యే టికెట్ సంపాయించుకుని బ‌రిలో దిగారు. ఇక‌, భూమా కుటుంబం నుంచి వార‌సురాలిగా వెలుగులోకి వ‌చ్చి మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్న భూమా అఖిల ప్రియ కూడా రెండ‌డు స్థానాలు ద‌క్కించుకున్నారు. ఇక‌, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్ కుమారుడు కూడా క‌ర్నూలు సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ తెచ్చుకున్నారు. పాణ్యం నుంచి కూడా వైసీపీ నుంచి వ‌చ్చిన గౌరు చ‌రితా రెడ్డి టికెట్ ద‌క్కించుకున్నారు.

ఇలా అనేక మంది వార‌సులు గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున పోటీ చేశారు. అయితే.. జ‌గ‌న్ సునామీ కార‌ణంగా.. టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ నేప‌థ్యంలో టీడీపీకి ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా ద‌క్క‌లేదు. అయితే.. పార్టీ నేత‌లు మాత్రం ఎవ‌రూ పార్టీకి రాం రాం చెప్ప‌లేదు. కానీ, నిస్తేజంగా మార‌డ‌మే ఇప్పుడు పార్టీకి పెను శాపంగా మారిపోయింది. అంంతేకాదు.. ఇప్పుడు అధిష్టానం వ్యవహారం నచ్చక కొందరు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారనే సూచ‌న‌లు అందుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీడీపీకి చావు దెబ్బ తగిలింది.

కర్నూలు కార్పొరేషన్‌తో పాటు అన్ని మునిసిపాలిటీలు అధికార పార్టీకి ద‌క్కాయి. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో కూడా టీడీపీకి గడ్డు పరిస్థితి తప్పదనే భావనకు పార్టీ శ్రేణులతో పాటు నేతలు వచ్చారు. ఈ నేప‌థ్యంలో పార్టీ నేత‌లు.. చాలా మంది టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపున‌కు కూడా స్పందించ‌డం లేదు. నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు చంద్ర‌బాబు పిలుపు ఇస్తున్నా... ఎవ‌రూ స్పందించ‌డం లేదు. కొన్నాళ్ల‌పాటు దూకుడు ప్ర‌ద‌ర్శించిన భూమా అఖిల ప్రియ కూడా.. హైద‌రాబాద్‌లో కేసు న‌మోదైన త‌ర్వాత‌.. కొన్నాళ్లు జైలుకు వెళ్లి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. రాజ‌కీయంగా సైలెంట్ అయ్యారు.

ఇక‌, 2019 ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ సైకిల్‌ దిగిబీజేపీ లోకి చేరిపోయారు.  ఆయన కుమారుడు టీజీ భరత్‌ మాత్రం టీడీపీలో ఉన్నా.. అంటీముట్టనట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు ‘కేఈ ఫ్యామిలీ’ హాజరు కావడం లేదు. సీనియర్‌ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కూడా కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కే పరిమితమయ్యారు. టీజీ భరత్, కేఈ శ్యాంబాబు పార్టీ వీడుతారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీజీ భరత్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు ఫోన్‌ చేసి బుజ్జగించినట్లు సమాచారం.    

+ కోడుమూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయిన మాజీ ఐఏఎస్‌ అధికారి రామాంజనేయులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఈ నియోజకవర్గంలో టీడీపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి వైఖరి కార్యకర్తలకు మింగుడుపడటం లేదు. కోట్ల సొంత నియోజకవర్గమైనా..ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

+ నందికొట్కూరులో టీడీపీ నేత బండి జయరాజు ఎన్నికల సమయంలో మాత్రమే కన్పించారు. నియోజకవర్గాన్ని పర్యవేక్షించే మాండ్ర శివానందరెడ్డి హైదరాబాద్‌లో మకాం వేశారు. ఇక్కడ టీడీపీని నడిపించే నాయకుడే లేరు.

+ నంద్యాల నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ప‌ట్టుబ‌ట్టి టికెట్ తెచ్చుకున్న‌ భూమా బ్రహ్మానందరెడ్డి ఓడిపోయిన త‌ర్వాత‌.. టీడీపీకి దూరంగా ఉన్నారు. చంద్ర‌బాబు ఎన్ని సార్లు నిర‌స‌నల‌కు పిలుపు ఇచ్చినా.. ఆయ‌న స్పందించ లేదు.

+ ఆదోనిలో మీనాక్షినాయుడు వయోభారంతో రాజకీయాలకు స్వస్తి చెప్పాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

+ మంత్రాలయంలో తిక్కారెడ్డి , పత్తికొండలో శ్యాంబాబు ఇప్పటి వరకు పార్టీ తరఫున ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు. ఆలూరులో కోట్ల సుజాతమ్మ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదు. పైగా వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. మ‌రోవైపు కోట్ల కుటుంబం వైసీపీ వైపు చూస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

+ ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు.

+ శ్రీశైలంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఎన్నికల తర్వాత పత్తా లేకుండా పోయారు.

+ పాణ్యం, బనగానపల్లె, కర్నూలు నేతలు స్థానికంగానే ఉంటున్నా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరు. ఇలా మొత్తంగా చూస్తే.. క‌ర్నూలు టీడీపీలో ఎన్న‌డూ లేని క‌ష్టాలు ప‌డుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిని చంద్ర‌బాబు ఎలా ఎదుర్కొంటారో.. పార్టీ నేత‌ల‌ను ఎలా లైన్‌లో పెడ‌తారో చూడాలి.
Tags:    

Similar News