అసలెందుకు ఎస్సీ -ఎస్టీలు ర‌గిలిపోతున్నారు?

Update: 2018-04-02 18:12 GMT

దేశ్యాప్తంగా ఈ రోజు (ఏప్రిల్ 2 వ తేదీన) రోడ్ల‌మీద‌కు వచ్చి త‌మ గ‌ళం వినిపించిన సంగ‌తి తెల‌సిందే. ప‌లు ప్రాంతాల్లో వీరి ఆందోళ‌న ఆగ్ర‌హం రూపం దాల్చ‌డం - పోలీసులు రంగ ప్ర‌వేశం చేయ‌డంతో ప‌లువురు మృతి చెందారు. ఎస్సీ - ఎస్టీలపై అకృత్యాల నిరోధక చట్టంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతోంది. దళితులు భారత్ బంద్‌ కు పిలుపునివ్వ‌డం వెనుక‌ కారణం ఏంటి అంటే.. గత నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ చట్టం దళితులపై దాడులను నిరోధించేందుకు ఉద్దేశించిన చట్టం.

ఈ చ‌ట్టం కింద నాన్‌ బెయిలబుల్ కేసులు నమోదు చేయవచ్చు. ఈ కేసుల విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్‌ ట్రాక్ కోర్టులు కూడా ఉన్నాయి. 2016, జనవరి 26న ఎస్సీ - ఎస్టీ చట్టం కిందికి వచ్చే నేరాల సంఖ్యను పెంచుతూ చట్టాన్ని సవరించారు. అయితే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఉద్దేశంతో ఇందులో మార్పులు చేయాల్సిందిగా గత నెల 20న సుప్రీంకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల మీద ప్రతి చిన్న విషయానికీ ఈ చట్టం కింద కేసులు నమోదవుతుండటాన్ని కోర్టు గుర్తించింది. దీంతో సంబంధిత అధికారిని నియమించిన వాళ్ల అనుమతి తీసుకున్న తర్వాతే అరెస్ట్ చేయాలని కోర్టు స్పష్టంచేసింది. సాధారణ జనం విషయానికి వస్తే జిల్లా ఎస్పీ ఆమోదం తర్వాతే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఎఫ్‌ ఐఆర్ నమోదు చేసే ముందే ప్రాథమిక విచారణ జరపాలని - అసలు ఆ కేసు ఎస్సీ - ఎస్టీ చట్టం కిందికి వస్తుందో రాదో చూడాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

సుప్రీంకోర్టు ఆదేశాలు చట్టాన్ని బలహీనపరచడమే అవుతుందని - దీనివల్ల తమ హక్కులకు భంగం కలుగుతుందని వాళ్లు గ‌ళం విప్పుతున్నారు. చట్టంలో మార్పులు తేవడం వల్ల ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ కేసులు పూర్తిగా తగ్గుముఖం పడతాయని వాళ్లు ఆందోళన వ్యక్తంచేశారు. అందులో భాగంగానే భారత్ బంద్‌ కు పిలుపునిచ్చారు. అటు ఎస్సీ - ఎస్టీ జాతీయ కమిషన్లు కూడా సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్నాయి. చట్టాన్ని సుప్రీం తీర్పుకు ముందు ఉన్న తీరుగానే అమలు చేయాలని కోరుతూ అప్పీల్ చేశారు. అటు ప్రభుత్వం కూడా ఇప్పటికే రీవ్యూ పిటిషన్ దాఖలు చేసింది. స‌హ‌జంగానే ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించాయి.
Tags:    

Similar News