అమ్మ స్థానంలో ఎమ్మెల్యే అయ్యేదెవ‌రు?

Update: 2017-02-18 11:31 GMT

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా అసెంబ్లీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు దేశ‌వ్యాప్తంగా చూపును ఆ రాష్ట్రం వైపు తిప్పుకొనేలా చేశాయి. అయితే మ‌రో ఆస‌క్తిక‌ర‌ ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌. తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని భావించిన శశికళకు సుప్రీం కోర్టు తీర్పు శరాఘాతంగా మారిన సంగ‌తి తెలిసిందే. మరో పదేళ్ల వరకు కనీసం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా చిన్న‌మ్మ‌కు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తన అక్క కుమారుడు దినకరన్‌ ను జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని శశి భావిస్తున్నారు. వాస్తవానికి పళనిస్వామి కేబినెట్ లో దినకరన్ కు మంత్రి పదవి ఇవ్వాలని శశి తొలుత భావించారు. అయితే, కనీసం ఎమ్మెల్యే కూడా కాని వ్యక్తికి మంత్రి పదవిని కట్టబెడితే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళతాయనే యోచనతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ నేపధ్యంలో దినకరన్ ను ఆర్కే నగర్ ఉప ఎన్నికల బ‌రిలోకి దింపి అనంత‌రం  మంత్రి ప‌ద‌వి  కట్టబెట్టాలని మన్నార్ గుడి టీమ్ భావిస్తోంది. అయితే, శశికళ కుటుంబంపై కొంత మేర వ్యతిరేకత కలిగిన ఆర్కే నగర్ ఓటర్లు దినకరన్‌ కు ఎంత మేర సపోర్ట్ చేస్తారనే అనుమానాలు కూడా ఉన్నాయి.

ఇదే స‌మ‌యంలో శశికళను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమ్మ న‌మ్మిన బంటైన మాజీ సీఎం పనీర్ సెల్వం ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో జయలలిత మేనకోడలు దీపను బరిలోకి దించాలని భావిస్తున్నారు. దీప పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉండడం తమకు లాభిస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే, తమిళ రాజకీయాలు ఆర్కే నగర్‌ కు మారడం ఖాయంగా కనిపిస్తోంది. దినకరన్-దీప ఉప ఎన్నికలో ముఖాముఖి తలపడితే, అక్కడి రాజకీయం మరింత వేడక్కడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే, ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాలి. జయ చనిపోయి ఇప్పటికే రెండు నెలలు ముగియడంతో, మరో నాలుగు నెలల్లోగా ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News