విమానం రెండు ముక్కలయ్యే సమయంలో ఏం జరిగింది?

Update: 2020-08-08 12:48 GMT
కోజికోడ్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమాన దుర్ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి తన అనుభవాల్ని ఒక మీడియా సంస్థతో పంచుకున్నారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఏం జరిగింది? తర్వాతేం జరిగిందన్న విషయం మీద కొందరు స్థానికులు మీడియాకు వెల్లడించారు. బాధితులతో ఏం జరిగిందన్న విషయాన్ని తాము తెలుసుకున్నామని.. వారు చెప్పిన వివరాలు.. తాము చూసిన వాటిని కలిపి చెప్పుకొచ్చారు. వారి మాటలకు కాస్తంత స్వేచ్ఛానువాదం చేస్తూ రాశామన్న విషయాన్ని గుర్తించగలరు. వారి అనుభవాల్ని విన్నప్పుడు అప్రయత్నంగా వణుకు పుట్టటం ఖాయం.

అప్పటివరకు సాఫీగా సాగిన ప్రయాణం కాసేపట్లో విమానం ల్యాండ్ అవుతుందన్న ప్రకటన వచ్చింది. సీటు బెల్టు బిగించుకున్నాం. ఒక్కసారి.. పెద్ద కుదుపు.. ఆ వెంటనే శబ్దం.. ఏం జరిగిందోఅర్థం కాలేదు. మొదడు మొత్తం మొద్దుబారిపోయినట్లైంది. ఆలోచించేందుకు మనసు ముందుకు వెళ్లటం లేదు. భయం మొత్తంగా కమ్మేసింది. అదే సమయంలో పెద్ద పెద్ద అరుపులు కేకలు.. ఆర్తనాదాలు.. చూస్తున్నంతనే.. మా విమానం దొర్లుకుంటున్నట్లుగా అర్థమైంది. పై నుంచి కింద పడినట్లుగా.. విసురుగా పడిపోయాం.

పెద్ద శబ్దాలు.. చుట్టూ భీతావాహ పరిస్థితి. ఏదో జరిగింది? ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. ఈ గందరగోళంలోనే చుట్టూ చూశా..చిన్నపిల్లలు.. సీట్ల కిందకు ఇరుక్కుపోయారు. వారుపెద్ద ఎత్తున ఏడుస్తున్నారు. చాలా బాధేసింది. చాలా మందికి గాయాలయ్యాయి. కొద్దిమంది విమానం లో నుంచి బయటకు విసిరేసినట్లుగా పడిపోయారు. చాలామంది కదల్లేకపోతున్నారు. చాలామందికి గాయాలైన విషయం అర్థమవుతోంది. ఒళ్లంతా దెబ్బలు.. రక్తం కారుతూ ఉంది.

ఓవైపు వర్షం కురుస్తోంది.చీకటి.. వాతావరణం చల్లగా ఉండటం.. అసలేం అర్థం కాని పరిస్థితి. ఏడుపులు పెడబొబ్బలు ఎక్కువయ్యాయి. తమ అయిన వాళ్లు మరణించిన విషయాన్నికొందరు గుర్తించారు. మరికొందరు తీవ్ర గాయాలైన విషయాన్ని అర్థం చేసుకొని ఏడుస్తున్నారు. ఆ ప్రాంతమంతా అరుపులు.. కేసులు.. ఏడుపులతో దద్దరిల్లిపోతోంది. పెద్ద వయస్కులు.. చిన్నారులు నరకయాతన పడుతున్నారు. కొద్దిమంది భయంతో తమ పెద్ద వాళ్లను అతుక్కుపోయారు. మరికొందరు తమ పెద్ద వాళ్లు ఎక్కడ ఉన్నారో అర్థం కాక.. పెద్ద ఎత్తున ఏడుస్తున్నారు. వారి ఏడుపు గుండెల్ని మెలిపెట్టేస్తోంది.

కొందరు ధైర్యం చేసి.. అసలేం జరిగిందో అర్థం చేసుకొని రియాక్ట్ అవుతున్నారు. కాక్ పిట్ లో ఇరుక్కుపోయిన వారిని బయటకు లాగే ప్రయత్నం చేస్తుంటే.. మరికొందరు బయటకు విసిరేసినట్లుగా పడిపోయిన వారిని జాగ్రత్తగా లేపుతున్నారు. చుట్టూ ఏమీ కనిపించటం లేదు. విమానం నుంచి పొగ వస్తుంది. ఏ నిమిషాన పేలుతుందో అన్న భయం వణికిస్తోంది. విమానంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొస్తున్నాం. సీట్లు.. సామాన్లు.. మొత్తం చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి.

చాలామంది కాళ్లు విరిగిపోయాయి.. చేతలు తెగాయి. బట్టలన్ని రక్తంతో తడిచిపోయాయి. అప్పుడే స్థానికులు వచ్చారు. అంబులెన్సులు.. ఎయిర్ పోర్టు అధికారులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. బాధితులకు సాయం చేస్తూ.. వారిని తమ కార్లలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. స్థానికుల సహకారంతో పాటు.. ప్రభుత్వ అధికారుల సైతం స్పందించిన తీరు బాగుంది. కాకుంటే.. ఈ విషాదం నుంచి బయటకు వచ్చే ఓపిక మాత్రం అప్పటికి దేవుడు మాకివ్వలేదని పేర్కొన్నారు.
Tags:    

Similar News