నిజరూపం ఇదేనా.. వైసీపీకి అప్రతిష్ట...?

Update: 2023-04-25 22:00 GMT
విశాఖ సిటీలో వైసీపీ పట్ల వ్యతిరేకత పెరుగుతున్న దశలో వచ్చిన అప్పన్న చందనోత్సవం లో అధికార పార్టీ నేతల నిర్వాకం కానీ అతి ఉత్సాహం కానీ చివరికి పార్టీకు చెడ్డ పేరు వచ్చేలా చేసిందా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఆస్తిక జనులు అంతా ఇదేమి తీరు, ఇవేమి ఏర్పాట్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల వైఖరి కూడా విమర్శల పాలు అయింది.

దీని మీద దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా మీటింగ్ పెట్టి మరీ అంతా బాగా చేశామని చెప్పినా ప్రయోజనం లేకపోయింది. చివర్లో ఆయన కలెక్టర్ ద్వారా విచారణ జరిపిస్తామని చెప్పి ముగించేశారు. పోలీస్ కమీషనర్ జరిపిన సమీక్షంలోనూ పోలీసు అధికారుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇక దీని మీద మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ చేశారు. భక్తులను నానా ఇబ్బందులు పెట్టిన చరిత్ర ఎపుడూ లేదని, దానికి కారణం అయిన వారిని శిక్షించాలని ఆయన కోరారు. సింహాచలం ఆలయ చైర్మన్ అయిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అయితే తన జీవితంలో ఇలాంటి దారుణమైన ఉత్సవ ఏర్పాట్లను చూడలేదని విమర్సించారు.

అది విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం అయినా లేక రామతీర్ధంలో ఉత్సవం అయినా చందనోత్సవం అయినా అధికారుల తీరు బాగులేదని, అధికార పార్టీ ప్రతీ దానిలో అతి జోక్యం చేసుకుంటూ ఆస్తిక జనుల మనోభావాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. గతంలో ఇలాటివి ఎపుడూ లేవని, అపచారాలు ఆగమ శాస్త్ర విరుద్ధమైన పనులు చేస్తున్నారని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా ఎన్నికల ఏడాదిలో ప్రవేశించిన వేళ విశాఖలో గత ప్రాభవాన్ని పొందాలని వైసీపీ చూస్తోంది. కానీ దానికి తగిన విధంగా ఎలా పార్టీని ప్రభుత్వాన్ని ఉంచాలో మాత్రం తెలియడంలేదు అంటున్నారు. ఒక పద్ధతిలో అంతా చూసే వారధి సారధి వైసీపీకి లేకుండా పోయారని అంటున్నారు.

దాంతోనే అధికారులు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చివరికి అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. ఈ విషయంలో చేసిన తప్పులనే చేసుకుంటూ పోతున్నారని, ఆఖరుకు భక్త జనులలో సైతం వైసీపీ ప్రభుత్వ నిర్వాకం పట్ల ఆగ్రహం అసంతృప్తి పెల్లుబికేలా చేసుకుంటున్నారని అంటున్నారు. అంతరాలయంలో గంటల తరబడి అధికార పార్టీ ప్రతినిధులు తిష్ట వేయడం, సామాన్య భక్తులనే కాదు వీవీఐపీలను కూడా బయట వేచి ఉండేలా చేయడం వంటివే తీవ్ర విమర్శలకు గురి చేసేలా చేశాయని అంటున్నారు.

మొత్తానికి అధికారులదే పొరపాటు అని తోసిపుచ్చినా రాజకీయంగా మాత్రం  వైసీపీ విమర్శల పాలు అవుతోంది. అయినా సరే తగిన విధంగా రిపేర్లు చేసుకుని ముందుకు సాగే మెకానిజం కొరవడడమే వైసీపీకి భారీ లోటు అని అంటున్నారు.

Similar News