ఫస్ట్ టైమ్ వైసీపీలో అసంతృప్తి... ?

Update: 2021-11-13 17:30 GMT
వైసీపీ లో ఇంతవరకూ చూడని సన్నివేశం ఏదైనా ఉంది అంటే అది పార్టీ నేతల అసంతృప్తి. ఇతర పార్టీల్లో అది కనిపిస్తుంది. అలకలు వివాదాలు ఉంటాయి. అయితే వాటిని తీర్చడానికి తగిన మెకానిజం కూడా అక్కడ ఉంటుంది. టీడీపీ, టీయారెస్ లాంటి ప్రాంతీయ పార్టీలలో ఏక పెత్తనం అని ఎంత అనుకున్నా కూడా అక్కడ కూడా ట్రబుల్ షూటర్స్ ఉంటారు. వారు రంగంలోకి దిగుతారు. కేసీయార్ అందుబాటులో ఉండకపోయినా కేటీయార్, హరీష్ రావు రూపంలో అధినాయకత్వానికి దగ్గరగా వెళ్లి బాధలు చెప్పుకోవచ్చు. అలా కేసీయార్ చెవిన తమ ఆవేదన చేరి మంచి జరిగే వీలుంటుంది. వైసీపీ విషయానికి వస్తే ఆ వెసులుబాటు అన్నదే లేదు. అధినేత జగన్ మాత్రమే. ఆయన తరువాత టూ త్రీ అంటూ ఏ రకమైన నంబర్స్ అసలు లేవు

పైగా పార్టీలో కూడా జగన్ తప్ప మరొకరు కనిపించరు. దాంతో ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ఇన్నాళ్ళూ జగన్ సెలెక్షన్ ఏం చేసినా కూడా అంతా సర్దుకుపోయేవారు. ఆయన మాటే ఫైనల్ అని కూడా భావించేవారు. ఇపుడు తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్ధుల విషయంలో మాత్రం చాలా చోట్ల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అది అన్ని జిల్లాల్లోనూ ఉండడం విశేషం. ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన గుంటూరులోనే వైసీపీ నేతలు దీని మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మరో మారు ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని అదే సామాజికవర్గానికి చెందిన వారు తప్పు పడుతున్నారు.

ఇప్పటికే ఆయనకు ఒక చాన్స్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఆయన అల్లుడు కిలారు రోశయ్యకు పొన్నూరు ఎమ్మెల్యే పదవి దక్కింది. అలాగే గత ఎన్నికల్లో ఉమ్మారెడ్డి వియ్యంకుడికి కూడా పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఇపుడు వయసు పైబడిన దశలో మరో మారు ఉమ్మారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కంటే యంగ్ బ్లడ్ కి ఇస్తే బాగుండేది కదా అన్న మాట ఉంది. ఇక మర్రి రాజశేఖర్ ఏం పాపం చేశారని జగన్ ఆయన్ని పక్కన పెట్టారని కూడా ఇదే జిల్లాలో వినిపిస్తున్న మాట.

జగన్ ఈసారి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఇద్దరికి టికెట్లు ఇచ్చారు. వారిద్దరి కంటే కూడా పార్టీలో ముందు నుంచి ఉంటూ గట్టి నేతగా పేరున్న మర్రి రాజశేఖర్ కి పదవి ఇవ్వకపోవడం జగన్ మాట తప్పడమే అంటున్నారు.. ఇక ఇదే జిల్లాలో మరో నేత రావి వెంకటరమణకు కూడా ఎమ్మెల్సీ ఆశ ఉంది. ఆయన పార్టీ తరఫున ఎంతో పోరాడుతున్నారు. కానీ జగన్ కళ్లలో మాత్రం పడలేకపోయారు అన్న బాధ అయిన ఆయన అనుచరుల్లో ఉందిట. ఇక మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు పదవి ఇవ్వడం పైన కూడా చర్చ సాగుతోంది. చిత్రమేంటి అంటే ఆయన వైసీపీలో ఇంకా చేరారో లేదో కూడా ఎవరికీ తెలియదు అంటున్నారు.

ఇక విశాఖ జిల్లా విషయానికి వస్తే వంశీ క్రిష్ణకు పదవి ఇవ్వడం మీద ఎవరికీ వేరే మాట లేకపోయినా వరుడు కళ్యాణికి ఎందుకు ఇచ్చారు అన్న ప్రశ్న వస్తోందిట. ఆమె కంటే కూడా సీనియర్లు ఉన్నారని, వారి విషయంలో కనీస పరిశీలన అయినా జరగలేదు అంటున్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అయితే అసంతృప్తి తో రగిలిపోతున్నారు అన్న మాట ఉంది. అలాగే ఎమ్మెల్సీ మీద ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఎ రహమాన్ వంటి వారు కూడా తమకు పదవులు దక్కవా అని నిర్వేదం చెందుతున్నారు.

విజయనగరంలో ఇందుకూరి రఘురాజు కంటే విశాఖలోని కోటఉరట్లకు చెందిన తంగేడు రాజులు గట్టిగా ఉంటారని, ఆ సామాజిక కోటాలో ఇవ్వాలీ అంటే వారే బెటర్ అన్న మాట కూడా ఉందిట. శ్రీకాకుళంలో కూడా పాలవలస కుటుంబానికే పదవులు అన్నీ పోతున్నాయి అన్న విమర్శలు ఉన్నాయి. మొత్తానికి జగన్ ఈసారి చేసిన సెలెక్షన్ సలక్షణంగా లేదన్న విమర్శలు అయితే సొంత పార్టీలోనే ఉన్నాయి. మరి వీరి అసంతృప్తి కాస్తా అసమ్మతిగా మారకముందే పార్టీ జాగ్రత్త పడడం బెటరేమో.






Tags:    

Similar News