ఆ ముగ్గురికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై వైసీపీలో అసంతృప్తి జ్వాలలు!

Update: 2023-02-21 14:00 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో ఒకేసారి 18 ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ 18 స్థానాల్లో 16 ఎమ్మెల్యేల కోటాలో, స్థానిక సంస్థల కోటాలో భర్తీ కానున్నాయి. మరో రెండు గవర్నర్‌ కోటాలో భర్తీ చేస్తారు.

కాగా ఎమ్మెల్సీలుగా వైఎస్‌ జగన్‌ ఎంపిక చేసిన 18 మందిలో ముగ్గురుపై వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కైకలూరు నుంచి జయమంగళ వెంకట రమణ,  తిరుపతి నుంచి సిపాయి సుబ్రహ్మణ్యం, తూర్పుగోదావరి జిల్లా నుంచి కుడిపూడి సూర్యనారాయణల ఎంపికపై వైసీపీలో అసంతృప్త జ్వాలలు చెలరేగుతున్నాయి.

ఈ ముగ్గురు నేతల్లో ఇద్దరు వారం రోజుల క్రితమే టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. మరో నేత కుల సంఘం నేతగా ఉన్నారు. పార్టీ కోసం ఇప్పటివరకు ఏమీ చేయని ఈ ముగ్గురు నేతలు ఆరేళ్ల వ్యవధి ఉన్న పదవిని అప్పనంగా కొట్టేశారని అంటున్నారు.

వైసీపీ ఏర్పాటు నుంచి ఎన్నో కష్టనష్టాలకోర్చి.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలతో తిట్లు తిని, పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకున్న తమను కాదని టీడీపీ నుంచి వచ్చిన నేతలకు ఇట్టే ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టడంపై జగన్‌ పై వైసీపీ నేతలు అంతర్గతంగా మండిపడుతున్నారని టాక్‌ నడుస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో మేకా శేషుబాబు, గుణ్ణం నాగబాబు ఎమ్మెల్సీ పదవులను ఆశించారు. వీరు ఎప్పటి నుంచో వైసీపీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడుతున్నారని చెబుతున్నారు. అయితే వీరిని కాదని నాలుగు రోజుల క్రితం టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణకు సీటు కేటాయించడంపై శేషుబాబు, నాగబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. అలాగే కైకలూరు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నేతలు సైతం జగన్‌ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారని తెలుస్తోంది.

అలాగే సిపాయి సుబ్రహ్మణ్యం తిరుపతి జిల్లాకు చెందినవారు. మూడు రోజుల క్రితం వరకు ఆయన టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శిగా ఉన్నారు. మూడు రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేశారు. ఆయనకు ఎమ్మెల్సీ సీటు లభించింది. ఈ సిపాయి సుబ్రహ్మణ్యం ఎవరో చిత్తూరు జిల్లా వైసీపీ నేతలకు కూడా తెలియదంటున్నారు. ఎంతో మంది నేతలు చిత్తూరు జిల్లా నుంచి ఈ పదవిని ఆశించగా టీడీపీ నుంచి మూడు రోజుల క్రితం పార్టీలో చేరిన సిపాయి సుబ్రహ్మణ్యంకు ఎమ్మెల్సీ ఎలా ఇస్తారని చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారని సమాచారం.

ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్న కుడిపూడి సూర్యనారాయణ కూడా ఒక వారం క్రితమే తాడేపల్లి వచ్చి సీఎం జగన్‌ ను కలిశారు. ఇప్పుడు తీరా చూస్తే ఆయనకు కూడా ఎమ్మెల్సీ పదవి లభించింది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు కుడిపూడి సూర్యనారాయణ చేసిందేమీ లేదని.. ఆయనకు ఎమ్మెల్సీ ఎలా ఇచ్చారోనని ఈ పదవిని ఆశించిన తూర్పుగోదావరి జిల్లా వైసీపీ నేతలు వాపోతున్నారట. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వైసీపీలో తీవ్ర దుమారాన్ని సృష్టించే ప్రమాదం ఉందనే చర్చ సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News