దివ్యపై అసత్య ప్రచారాలు చేయకండి: తల్లి కుసుమ

Update: 2020-10-15 17:36 GMT
విజయవాడలో యువతి దారుణ హత్య కేసు కలకలం రేపింది. క్రీస్తురాజపురం ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని ప్రేమ పేరుతో వేధించిన నాగేంద్రబాబు అలియాస్ స్వామి.. గురువారం ఆమెపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు. చికిత్స పొందుతూ దివ్య మృతి చెందడం విషాదం నింపింది.

ఉన్మాది స్వామి చేతిలో దివ్య తేజస్విని అనే అమ్మాయి బలి అయిపోవడంపై మహిళా సంఘాలు ఆగ్రహించాయి.. ఈ సందర్భంగా దివ్య తేజస్విని తల్లి కుసుమ తన ఆవేదనను వెల్లగక్కారు. కావాలనే కొంతమంది తన కుమార్తె గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయింది. తన కుమార్తె ప్రేమ, పెళ్లి అని కొంత మంది పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని మండిపడింది.

భీమవరంలోని మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో దివ్య తేజస్విని బీటెక్ చదువుతోందని ఆమె తల్లి కుసుమ తెలిపింది. నాగేంద్ర అనే పెయింటర్ తన కూతురును చంపాడని.. అతడు గంజాయి తాగి తిరుగుతూ ఉంటాడని.. అలాంటి తిరుగుబోతుకు, దివ్యకు సంబంధం కలుపుతున్నారని మండిపడ్డారు. ఎందుకు పనికిరాని వాడిని తన కూతురు ఎందుకు పెళ్లి చేసుకుంటుందని ప్రశ్నించింది. కొందరు ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురు గురించి అసత్యాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇక ఈ దారుణ ఘటనను మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా ఖండించారు. ప్రేమ పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టం కింద నిందితులను ఇలాంటి కేసుల్లో కఠినంగా శిక్షిస్తామన్నారు.
Tags:    

Similar News