మహమ్మారి బారిన పడ్డాక హోమ్ ఐసోలేషన్‌లో ఉండకుండా బయట తిరగడం తప్పేనని సెర్బియన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ అంగీకరించాడు. గత డిసెంబర్‌లో అతనికి కరోనా సోకిందని, దాని వల్లే వ్యాక్సినేషన్ వేయించుకునే సమయం లభించలేదనే కారణంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ప్రత్యేక వైద్య మినహాయింపు పొందాడు.
దీంతో తనను తొమ్మిది సార్లు విజేతగా నిలిపిన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఎంచక్కా ఆడేద్దామనుకున్నాడు. ఇక్కడ 10వ సారి గెలిచి 21 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డుతో చరిత్ర సృష్టించాలనుకున్నాడు.అయితేజొకోవిచ్‌కు కంగారూ గడ్డపై వచ్చీరాగానే అసలు కష్టాలు ఎదురయ్యాయి. మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్‌లోనే అతన్ని నిలిపివేయడంతో పాటు వీసాను రద్దు చేశారు.
చివరకు కోర్టు మెట్లెక్కి ఊరట పొందిన సెర్బియన్ ఎట్టకేలకు బుధవారం తను చేసింది పొరపాటేనని అంగీకరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. స్వదేశంలో అతను కోవిడ్ సోకిన తర్వాత కరోనా ప్రొటోకాల్‌కు విరుద్ధంగా పలు ప్రచార కార్యక్రమాల్లో, జన సమూహాల్లో పాల్గొన్నాడు. వైరస్ ఇన్ఫెక‌్షన్ సోకాక తను హోమ్ ఐసోలేషన్‌లో గడపాల్సివుండాలని తాజాగా అభిప్రాయపడ్డాడు.
రాకెట్ పడతాడో... బ్యాగ్ సర్దుకుంటాడో...
జొకోవిచ్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడేది లేనిది నేడు తేలనుంది. ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలు, బోర్డర్ ఫోర్సు అధికారులు అతను మినహాయింపునకు సమర్పించిన పత్రాలను పకడ్బందీగా పరిశీలిస్తున్నారు. ప్రత్యేక వైద్య మినహాయింపు కోసం అతను తప్పుడు ధ్రువపత్రాలు దాఖలు చేసివుంటే అది ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం కఠిన నేరమవుతుంది.
ఈ నేరం కింద గరిష్టంగా ఐదేళ్ల జైలుశిక్ష అనుభవించాల్సివుంటుంది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడిపై కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలేవీ కనిపించడం లేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నిర్వాహాకులు బుధవారం ప్రకటించిన సీడింగ్స్‌లో జొకోకు టాప్ సీడ్ దక్కింది. గురువారం మధ్యాహ్నం తర్వాత టోర్నీకి సంబంధించిన అధికారిక డ్రా కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అతడికి హెచ్చరిక జారీ చేస్తూ సరిపెట్టాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
అసలేం జరిగింది!
జొకోవిచ్ ఒక్క డోసు కూడా వ్యాక్సిన్ వేయించుకోలేదు. ఆసీస్‌లో ఆడుగు పెట్టాలనుకునే విదేశీయుడు ఎవరైనా సరే డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు ఉన్న వ్యాక్సినేషన్‌ను రెండు డోసులు పూర్తి చేసుకొని ఉండాల్సిందే! అయితే తనకు ఫేవరెట్ టోర్నీ (ఇక్కడ 9 సార్లు విజేత)లో టైటిల్ నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక వైద్య మినహాయింపు పొంది ఆసీస్ వచ్చాడు.
గత ఆరు నెలల కాలంలో వైరస్ బారిన పడినవారికి టీకా మినహాయింపు ఇస్తారు. డిసెంబర్లో వైరస్ బారిన పడ్డానని, వ్యాక్సిన్ తీసుకునే సరైన సమయం లేదని మినహాయింపు పొందాడు. అయితే తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగానీ, ట్రీట్‌మెంట్‌తో కోలుకున్నట్లుగానీ పేషెంట్ కేస్‌షీట్ వివరాలేవీ లేకపోవడంతో సహేతుక కారణాలు లేవని ఇచ్చిన మినహాయింపును, జారీ చేసిన వీసాను ఆస్ట్రేలియా రద్దు చేసింది.