వైసీపీకి సింగిల్ డిజిట్... ఈ సర్వే ఎవరిది...?

Update: 2022-12-21 11:30 GMT
వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది పెద్ద చర్చ. దాని మీద సర్వేలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇక ఎవరి మటుకు వారు తమ పార్టీయే గెలుస్తుంది అని అంటూంటారు. అయితే ప్రస్తుతానికి వైసీపీలోనే ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్, మాజీ మంత్రి వైఎస్సార్ సమకాలీనుడు అయిన డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి ఒక సంచలన  సర్వే వినిపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే అది కూడా గొప్పే అన్నారు. అంటే వైనాట్ 175 అంటూ వైసీపీ దూకుడు చేస్తూంటే కేవలం పది లోపు సీట్లు మాత్రమే వైసీపీకి వస్తాయని డీఎల్ చెప్పడం విశేషమే అనుకోవాలి.

డీఎల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ జగన్ని అతి పెద్ద అవినీతిపరుడిగా కూడా విమర్శించారు. జగన్ వైఎస్సార్ కుమారుడిగా తాము వేరేగా చూశామని, అయితే ఆయన అంత అవినీతిపరుడు మరొకరు లేరు అని డీఎల్ విమర్శలు గుప్పించారు.  ఇక ఏపీని వైసీపీ సర్వనాశనం చేసింది అని ఆయన దుయ్యబెట్టారు. ఈ పరిస్థితుల్లో ఏపీని కాపాడాలీ అంటే అది ఒక్క చంద్రబాబు వల్లనే సాధ్యమని కూడా డీఎల్ చెప్పారు.

మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజాయతీని ప్రశ్నించలేమని అన్నారు. అయితే జనసేన టీడీపీ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తాయని అనుకుంటున్నట్లుగా డీఎల్ అంటున్నారు. ఆ పార్టీలు కలసి పోటీ చేస్తే ఏపీలో వైసీపీకి ఒంటరి సంఖ్యలొనే సీట్లు వస్తాయని అది కూడా గొప్పే అని ఆయన అన్నారు.

ఇక వైఎస్ వివేకా కేసు విచారణ జనవరి 3 నుంచి జరగనుందని, దాంతో కొత్త మలుపు ఈ కేసు తిరుగుతుందని డీఎల్ అంటున్నారు. ఈ కేసులో ఎర్ర గంగిరెడ్డి కీలకమైన వ్యక్తి అని సీబీఐ గుర్తించిందని ఆయన అన్నారు. ఇక జనవరి 3న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ మీద వాదనలు ఉన్నాయని, ఆ రోజున సుప్రీం తీర్పు తరువాత కడప జిల్లాలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని డీఎల్ అంటున్నారు.

మాజీ మంత్రి  వివేకా  కేసుతో చాలా మంది మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంది అని ఆయన పేర్కొనడం విశేషం. ఇదిలా ఉండగా వివేకా హత్య కేసు విషయంలో ఒంటరిగా ఆయన కుమార్తె సునీత పోరాడడం మెచ్చుకోవాల్సిందే అని ఆయన అన్నారు.

ఇక తన గురించి చెబుతూ ఈ రోజుకీ తాను వైసీపీలోనే ఉన్నానని, తనను ఎవరూ తీసేయ లేదని అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తాను ఏదో ఒక ప్రముఖ పార్టీ నుంచే పోటీకి దిగుతాను అని డీఎల్ చెబుతున్నారు. మొత్తానికి డీఎల్ వైసీపీ మీద జగన్ మీద కడప జిల్లా రాజకీయాల మీద సంచలన కామెంట్స్ చేశారు. దీనికి వైసీపీ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News