ప్ర‌శాంత్ కిషోర్‌ ను హిందీ పార్టీలు ప‌ట్టించుకోవ‌డం లేదా?

Update: 2022-04-18 15:30 GMT
ప్ర‌శాంత్ కిషోర్‌.. త‌క్కువ కాలంలోనే దేశంలో ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ఎదిగారు. త‌న ప్ర‌ణాళిక‌లు, వ్యూహాలు, జిమ్మిక్కుల‌తో న‌మ్ముకున్న పార్టీని గెలిపించ‌డం కోసం ఎంత‌కైనా తెగిస్తారు. అందుకు రూ.వంద‌ల కోట్ల‌లో డ‌బ్బు అందుకుంటారు. పీకే అడుగుపెడితే ఇక ఆ పార్టీకి తిరుగుండ‌దు అనేలా ప‌రిస్థితి మారింది. అయితే పార్టీని గెలిపించ‌డం కోసం కుల‌, మ‌త, ప్రాంతాల ప్ర‌తిపాద‌క‌న ప్ర‌జ‌ల‌ను విడ‌గొట్ట‌డం, విద్వేషాలు రెచ్చ‌గొట్ట‌డం, గొడ‌వ‌లు, దాడులు సృష్టించ‌డం పీకేకు అల‌వాట‌నే విమ‌ర్శ‌లూ వినిపిస్తున్నాయి. ఇక ఇలాంటి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌ను హిందీ రాష్ట్రాలు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ద‌క్షిన భార‌తంలో, హిందీయేత‌ర రాష్ట్రాల్లో పీకేకు మంచి క్రేజ్ ఉంది. ఏపీలో జ‌గ‌న్‌, త‌మిళ‌నాడులో స్టాలిన్‌, ప‌శ్చిమ బెంగాల్‌లో మ‌మ‌తా బెన‌ర్జీ, ఇప్పుడు తెలంగాణ‌లో కేసీఆర్‌.. ఇలా అంద‌రూ పీకే సేవ‌లు వాడుకుంటున్నారు. మ‌రోవైపు మ‌హారాష్ట్ర‌, గోవాల్లోనూ ఆయ‌న ప్ర‌భావం చూపుతున్నారు. కానీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లాంటి హిందీ రాష్ట్రాల విష‌యానికి వ‌చ్చేస‌రికి అక్క‌డి పీకేని ప‌ట్టించుకునే పార్టీనే క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు ఆయ‌న బాధ కూడా అదేన‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఇటీవ‌ల దేశ రాజకీయాల్లో కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ పెద్ద రాష్ట్రానికి జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏ పార్టీ కూడా పీకే సాయం కోర‌లేదు. అక్క‌డ ప‌ట్టు సాధించిన బీజేపీ తిరిగి అధికారం ద‌క్కించుకుంది. కానీ ప్ర‌త్య‌ర్థి పార్టీలు స‌మాజ్‌వాదీ, బ‌హుజ‌న్ స‌మాజ్‌, కాంగ్రెస్ పీకే వైపు కన్నెత్తి కూడా చూడ‌లేదు.

2017లో యూపీలో పీకే సాయం కాంగ్రెస్ కోరిన‌ప్ప‌టికీ దానివ‌ల్ల పార్టీ రాత మార‌లేదు. అందుకే ఈ సారి దూరం పెట్టారు. ఇక హిందీ రాష్ట్రాల్లో ఎక్కువ‌గా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు ఆప్ కూడా దిల్లీ, పంజాబ్లో గెలిచి జాతీయ పార్టీగా మారింది. దీంతో ఈ రాష్ట్రాల్లోని పార్టీల‌కు పీకే అవ‌స‌రం లేకుండా పోయింది.

కానీ మ‌రోవైపు ప్రాంతీయ పార్టీలు మాత్రం సీఎం కుర్చీ సొంతం చేసుకునేందుకు పీకే సాయం కోరుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్రానికే ప‌రిమితం కాబట్టి అక్క‌డి స్థానిక ప‌రిస్థితులు ఆ పార్టీ విజ‌యాల‌ను డిసైడ్ చేస్తాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను దెబ్బ‌కొట్టేందుకు పీకేను రంగంలోకి దించుతున్నారు. తెలంగాణ‌, ఏపీ, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్‌లో అదే జ‌రుగుతోంది.

పీకేను న‌మ్ముకుంటే సీఎం పోస్టు ద‌క్కిన‌ట్లే అని ప్రాంతీయ పార్టీల అధినేత‌లు భావిస్తుండ‌డ‌మే అందుకు కార‌ణం. కానీ ఇప్పుడు పీకే కాంగ్రెస్‌తో జ‌ట్టు క‌ట్ట‌బోతుండ‌డంతో ప‌రిస్థితుల్లో ఏమైనా మార్పులు వ‌స్తాయా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News