మా దేశానికి పంపొద్దు: కోర్టుకెక్కిన అమెరికా వృద్ధుడు

Update: 2020-07-12 07:30 GMT
మ‌హ‌మ్మారి వైర‌స్ ప్ర‌పంచంలో అత్య‌ధికంగా వ్యాపిస్తున్న దేశం అమెరికా. ప్ర‌పంచ‌మంతా 1.28 కోట్ల మందికి వైర‌స్ సోక‌గా వాటిలో పెద్ద‌సంఖ్య‌లో అమెరికా ప్ర‌జ‌లే ఉన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు అమెరికాలో 34 లక్షల మంది వైర‌స్ బారిన పడ్డార‌ని గ‌ణాంకాలు చెబుతున్నారు. ఈ స‌మ‌యంలో అమెరికా వెళ్లడానికి సాహ‌సించ‌డం లేదు. మ‌హ‌మ్మారి తీవ్ర‌స్థాయిలో విజృంభించ‌డంతో ఆ దేశానికి చెందిన పౌరులే వెళ్ల‌డానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ క్ర‌మంలో భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఓ అమెరికా వృద్ధుడు ఇప్పుడు త‌న దేశానికి వెళ్ల‌లేన‌ని చెబుతున్నాడు. ఈ సంద‌ర్భంగా ఏకంగా హైకోర్టును ఆశ్ర‌యించి త‌న‌ను అమెరికా పంప‌వ‌ద్ద‌ని కోరాడు. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లో చోటుచేసుకుంది.

ఫిబ్రవరిలో అమెరికాకు చెందిన వృద్ధుడు పీర్స్ భార‌త‌దేశ సంద‌ర్శ‌న‌కు వచ్చాడు. ఈ సంద‌ర్భంగా కేరళలో అనేక పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తున్న స‌మ‌యంలో వైర‌స్ విజృంభించింది. అనంత‌రం లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. దీంతో అత‌డు కేర‌ళ‌లోనే ఉంటున్నాడు. అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి వ‌చ్చాయి. అత‌డి టూరిస్ట్ వీసా ముగుస్తోంది. అయితే అమెరికాలో వైర‌స్ తీవ్ర‌రూపంలో ఉండ‌డంతో పీర్స్ త‌న స్వ‌దేశానికి వెళ్లేందుకు జంకుతున్నాడు. దీంతో ఆయ‌న త‌న‌ను అమెరికా పంప‌వ‌ద్ద‌ని.. భార‌త్‌లోనే ఉంటాన‌ని చెబుతూ ఏకంగా కేరళ హైకోర్టును ఆశ్రయించాడు.

తాను భార‌త్‌లోనే ఉంటానని.. తన టూరిస్ట్ వీసాను బిజినెస్ వీసాగా మార్చాలని కోరుతూ పీర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైర‌స్‌ను కట్టడి చేయడంలో త‌న దేశం అమెరికా విఫ‌ల‌మైంద‌ని ఆరోపించాడు. అందుకే కేసులు భారీగా పెరుగుతున్నాయ‌ని గుర్తుచేశాడు. అయితే భార‌త్‌లో వైర‌స్ కట్టడి చర్యలు బాగున్నాయని, తాను ఇక్క‌డే ఉండిపోవాలని నిర్ణ‌యించుకుంటున్నట్టు పీర్స్ పిటిష‌న్‌లో పేర్కొన్నాడు. అందులో భాగంగానే భార‌త‌దేశంలో తాను ఓ టూరిస్ట్ కంపెనీ పెట్టాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలిపాడు. ఈ విధంగా ఆయ‌న అమెరికా వెళ్ల‌కుండా భార‌త్‌లో ఉండేందుకు పిటీష‌న్ వేసిన వార్త హాట్ టాపిక్‌గా మారింది. అయితే పీర్స్ టూరిస్ట్ వీసా ఆగష్టు 24వ తేదీతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే అయన హైకోర్టును ఆశ్ర‌యించాడు.
Tags:    

Similar News