'మాయ' పనిచేయటం లేదా ?

Update: 2022-02-14 07:30 GMT
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మాయావతి మాయ పనిచేయటం లేదని తేలిపోతోంది. మొదటి విడత పోలింగ్  జరిగిన 58 సీట్లలో అత్యధికం ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమికే పడ్డాయని విశ్లేషణలు మొదలయ్యాయి. ఈరోజు రెండోదశ పోలింగ్ మొదలైంది. రెండో విడతలో కూడా పై కూటమికే ఎక్కువ ఓట్లు పడే అవకాశముందని సమాచారం. కారణం ఏమిటంటే బీఎస్పీ అధినేత్రి మాయావతి మాయ పనిచేయటం మానేయటమేనట.

బీజేపీ కూటమి-ఎస్పీ కూటమి మధ్య బీఎస్పీ కూడా పోటీగా అన్నీ స్ధానాల్లో తన అభ్యర్ధులను నిలిపింది. అయితే బీఎస్పీ అంటే బీజేపీ బీ టీమ్ అనే ముద్ర బలంగా పడిపోయింది. ఎస్పీ కూటమికి పడే ఓట్లను చీల్చి బీజేపీ కూటమికి లబ్ది చేకూర్చేందుకే మాయావతి అన్నీ చోట్లా అభ్యర్ధులను పోటీలోకి దింపినట్లు విస్తృతంగా ప్రచారం జరిగిపోయింది. ఎన్నికల వేడి మొదలైన తర్వాత కూడా మాయావతి ఎక్కడా కనబడలేదు. ఎన్నికల షెడ్యూల్ మొదలైనా కనబడలేదు.

అయితే హఠాత్తుగా టికెట్ల కేటాయింపులో మాత్రం యాక్టివ్ గా కనిపించారు. ఇక్కడే మాయావతి వైఖరిపైన అందరిలోను అనుమానాలు పెరిగిపోయాయి. టికెట్ల కేటాయింపును చూసిన తర్వాత అనుమానాలన్నీ నిజాలే అని జనాలకు అర్ధమైపోయింది.

ఎలాగంటే ఎస్పీ కూటమి ఏ సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధులను పోటీలోకి దింపారో అదే సామాజికవర్గానికి చెందిన నేతలను మాయావతి పోటీలోకి దింపారు. అంటే ముస్లింలైతే ముస్లింలు, జాట్లయితే జాట్లు, ఓబీసీలైతే అదే ఓబీసీలను బీఎస్పీ పోటీలోకి దింపింది.

మాయావతి నిర్ణయం డైరెక్టుగా బీజేపీ కూటమికి మేలు చేసేందుకే అని జనాలకు అర్ధమైపోయింది. అందుకనే బీఎస్పీ తరపున ఎవరు పోటీచేస్తున్నా ఓట్లు మాత్రం ఎస్పీ కూటమికే పడుతున్నాయట. ట్యాక్సీ డ్రైవర్లు, ట్రక్కు డ్రైవర్లు, దర్జీలు, హోటళ్ళలో పనిచేసే వాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు కూడా ఇదే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. అంటే మాయావతి వైఖరి విషయంలో జనాల్లో చాలా క్లారిటి ఉన్నది తేలిపోయింది.

ఇందుకనే మొదటి విడత పోలింగ్ లో బీఎస్పీ అభ్యర్ధులున్నా, బీజేపీని కాదని ఎస్పీ కూటమికికే ఎక్కువ ఓట్లు పడ్డాయనే విశ్లేషణలు పెరిగిపోతున్నాయి. మరి రెండోదశలో ఏమవుతుందో చూడాలి.
Tags:    

Similar News