క‌ర్నూల్లో ఆధిప‌త్య పోరు.. బాబుకు త‌ల‌నొప్పి

Update: 2021-10-19 07:37 GMT
క‌ర్నూలు జిల్లాలో తెలుగు దేశం పార్టీకి అస‌లే ప‌రిస్థితులు బాగాలేవు. ఎన్నిక‌ల్లో వ‌రుస ప‌రాజ‌యాల‌తో పార్టీ కుదేలైంది. బ‌ల‌మైన వైసీపీని ఎదుర్కోలేక గ‌డ్డు ప‌రిస్థితుల్లో ఉన్న పార్టీకి అక్క‌డ మ‌రో స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. కర్నూలు టీడీపీ నేత‌ల మ‌ధ్య అంత‌ర్యుద్దం మొదలైంది. మ‌ళ్లీ కేఈ, కోట్ల కుటుంబాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు ర‌గిలింది. కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న ఈ కుటుంబాలు.. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ వేదిక‌గా క‌లిసే ప‌ని చేసినా వైసీపీ ధాటికి ఓట‌మి త‌ప్ప‌లేదు. ఇక ఇప్పుడేమో మ‌ళ్లీ త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఈ రెండు కుటుంబాలు సొంత పార్టీలోనే కుంప‌టి ర‌గిల్చాయ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ పంచాయ‌తీ బాబు ద‌గ్గ‌ర‌కు చేరింద‌ని ఆయ‌న సూచ‌న‌లతో రెండు కుటుంబాలు సంతృప్తి చెంద‌లేద‌ని స‌మాచారం.

ఆలూరు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే టికెట్ విష‌యమై ఈ రెండు కుటుంబాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు మొద‌లైంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఆ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా కోట్ల సుజాత‌మ్మ ఉన్నారు. కానీ ఇటీవ‌ల కేఈ ప్ర‌భాక‌ర్ ఎక్కువ‌గా ఆలూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. అక్క‌డి టీడీపీ శ్రేణుల‌ను త‌న‌వైపు తిప్పుకుంటున్నారు. ఇక్క‌డి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నందుకే ఆయ‌న ఇప్ప‌టి నుంచే పార్టీ స్థానిక నేత‌ల‌ను కార్య‌క‌ర్త‌ల‌ను మ‌చ్చిక చేసుకుంటున్నార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆలూరు నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న సుజాత‌మ్మకు ప్ర‌భాక‌ర్ వ్య‌వ‌హార శైలి రుచించ‌డం లేదు. అందుకే ఆమె బాబును క‌లిసి ప‌రిస్థితుల‌ను వివ‌రించారు.

ఎమ్మెల్సీ కేఈ ప్ర‌భాక‌ర్ ఆలూరులో జోక్యం చేసుకుంటున్నార‌ని అలా చేయకుండా ఆదేశాలు ఇవ్వాల‌ని బాబును సుజాత‌మ్మ కోరిన‌ట్లు తెలిసింది. కానీ బాబు మాత్రం.. సుజాత‌మ్మ‌ను డోన్ నుంచి పోటీ చేయాల‌ని సూచించిన‌ట్లు స‌మాచారం. 2004లో డోన్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు అక్క‌డ మంచి ప‌రిచ‌యాలు ఉంటాయ‌ని అందుకే అక్క‌డి నుంచి పోటీ చేయాల‌ని బాబు చెప్పార‌ని టాక్‌. కానీ ఎంపీగా త‌న భ‌ర్త కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి పోటీ చేస్తారు కాబ‌ట్టి ఆలూరు అయితే పార్ల‌మెంట్‌కు కూడా బాగా క‌లిసొస్తుంద‌ని సుజాత‌మ్మ చెప్పిన ఆమె మాట‌ను బాబు పెడ‌చెవిన పెట్టిన‌ట్లు తెలుస్తోంది. క‌ర్నూలు పార్ల‌మెంట్ ప‌రిధిలో బీసీ అభ్య‌ర్థిని దించే ఆలోచ‌న‌లో బాబు ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. అందుకే కోట్ల కుటుంబాన్ని డోన్‌కు పంపించి.. ఆ దంప‌తుల్లో ఒక‌రికి మాత్ర‌మే సీటు ఇవ్వాల‌ని బాబు అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. దీంతో ఆ కుటుంబానికి ఒక్క సీటు మాత్ర‌మే ద‌క్కుతుంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో డోన్ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా గ‌త రెండు ఎన్నిక‌ల్లో పోటీ చేసిన కేఈ ప్ర‌తాప్‌కు ఈ సారి అక్క‌డ అవ‌కాశం లేన‌ట్లే.

ఇలా రెండు కుటుంబాల‌కు అసంతృప్తి క‌లిగించేలా బాబు నిర్ణ‌యం తీసుకోవ‌డం క‌ర్నూలులో పార్టీ ప‌రిస్థితిపై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. ఆశించిన టికెట్లు ద‌క్క‌న‌పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అదే పార్టీలో ఉంటూ పార్టీకి వ్య‌తిరేకంగా ప‌ని చేసే అవ‌కాశాల‌ను కొట్టి పారేయ‌లేమ‌ని అలా జ‌రిగితే పార్టీకి తీర‌ని న‌ష్టం క‌లుగుతుంద‌ని పార్టీ శ్రేణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. మ‌రోవైపు గ‌త 20 ఏళ్ల‌లో క‌ర్నూలులో టీడీపీ ఎప్పుడూ ఆశాజ‌న‌క ఫ‌లితాలు సాధించ‌లేద‌ని ఈ నేప‌థ్యంలో అక్క‌డ బ‌ల‌హీనంగా ఉన్న పార్టీ త‌ర‌పున ఎవ‌రు ఎక్క‌డ పోటీ చేసినా మార్పు పెద్ద‌గా ఉండ‌ద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.




Tags:    

Similar News