వరుస వాయింపు.. బాబోయ్ మరో వేరియంట్ అంటా!

Update: 2022-01-04 13:30 GMT
కరోనా మహమ్మారి వివిధ వేరియంట్ల రూపంలో వరుసుపెట్టి విజృంభిస్తోంది. డెల్టా రూపంలో గతేడాది పంజా విసిరిన వైరస్... ఒమిక్రాన్ పేరుతో చాపకింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. అతివేగంగా వ్యాప్తి చెందే ఈ వేరియంట్ తో మూడో వేవ్ ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. గత పదిహేనురోజులుగా పాజిటివ్ కేసులు సైతం విపరీతంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ తోపాటు సాధారణ వైరస్ కేసులు కూడా గుర్తిస్తున్నారు. అయితే పారిస్ మరో వేరియంట్ పుట్టుకొచ్చిందని అక్కడి వైద్యులు తెలిపారు. 12 మందిలో కొత్తవేరియంట్ ను గుర్తించినట్లు వెల్లడించారు.

ఫ్రాన్సులోని మార్సెయిల్స్ ప్రావిన్స్ లో గుర్తించిన ఈ న్యూ వేరియంట్ కు హైచ్ఐయూగా పిలుస్తున్నారు. దీనికి అతివేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్నాయని ఫ్రాన్సు వైద్య నిపుణులు వెల్లడించారు. అంతేకాకుండా అతిప్రమాదకరం అని అంటున్నారు. దీనిలోనూ మరో 46వరకు వేరియంట్లు ఉంటాయని వెల్లడించారు. ఇకపోతే బాధితులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం గమనార్హం. అయినా కూడా ఈ హెచ్ఐయూ వేరియంట్ సోకిందని పేర్కొన్నారు. కామెరాన్ కు పోయివచ్చిన వ్యక్తుల్లో దీనిని గుర్తించినట్లు చెప్పారు. వారిలో ఒకరు అమెరికా నుంచి స్వదేశానికి వచ్చిన వారు ఉన్నారని తెలిపారు.

హైచ్ఐయూలో ఎన్ 501వై, అమైనోయాసిడ్స్ సిబ్ స్టిట్యూషన్స్, ఈ484కే, స్పైక్ ప్రోటీన్లు ఉన్నట్లు పారిస్ వైద్య నిపుణులు తెలిపారు. వీటివల్ల తీవ్రమైన ముప్పు ఉంటుందని చెబుతున్నారు. కాగా దీనిద్వారా ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్సు ప్రభుత్వం అప్రమత్తమైంది. కొన్ని ప్రదేశాల్లో ఆంక్షలు అమలు చేస్తోంది. అంతేకాకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేసింది. కాగా వైరస్ వరుస వేరియంట్లతో జనం జంకుతున్నారు. ఈ వైరస్ ఏంటో.. వరుస వాయింపు ఏంటో బాబోయ్ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారతదేశంలోనూ కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబయి, దిల్లీ, కలకత్తాలో భారీగా కేసులు బయటపడుతున్నాయి. కొత్త కేసుల్లో దాదాపు 75 శాతం ఈ మెట్రో సిటీల్లోనే గుర్తించారని వైద్యారోగ్య శాఖ తెలిపింది. మనదేశంలో డిసెంబర్ మొదటి వారంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసు నమోదైందని... కాగా అప్పటినుంచి పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు. డిసెంబర్ మూడో వారంలో 12 శాతం కేసులు నిర్ధారణ అయ్యాయి. అవికాస్త డిసెంబర్ చివరినాటికి 28 శాతాన్ని మించాయని చెప్పారు. వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువవుతోందని వెల్లడించారు.

దేశ రాజధాని దిల్లీపై కరోనా విశ్వరూపం చూపిస్తోందని వైద్యారోగ్యశాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా అక్కడ ఇటీవల నమోదవుతున్న కేసుల్లో దాదాపు 75 శాతం కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కావడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ కు అతివేగంగా వ్యాప్తి చెందే గుణం ఉందని... త్వరలో మరిన్ని కేసులు వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.
Tags:    

Similar News