కొత్త చట్టం తెస్తానంటున్న ట్రంప్

Update: 2017-02-11 09:31 GMT
వివాదాలకు.. సంచలనాలకుకేరాఫ్ అడ్రస్ లాంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడేం చేస్తారో చెప్పటం చాలా కష్టం. ఎవరు ఏమనుకున్నా.. ఎంతగా తప్పు పట్టినా.. ఎన్ని విమర్శలు ఎదురైనా.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసే మొండి మనిషి ట్రంప్. ఇటీవల ఏడు మెజార్టీ ముస్లిం దేశాలకు చెందిన ప్రజలు అమెరికాకు వచ్చే విషయంపై నిషేదాన్ని విధించి సంచలనం సృష్టించిన ఆయన.. ఎన్ని విమర్శలు ఎదురైనా వెనక్కి తగ్గేందుకు ఇష్టపడలేదు.

అయితే.. కోర్టుల నుంచి ఎదురైన వరుస ఎదురుదెబ్బల నేపథ్యంలో.. తాను జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ వెనక్కి తగ్గుతున్నారా? అన్న సందేహం తాజాగా కలుగుతోంది. అయితే.. అది వెనక్కి తగ్గటమా? లేక.. తన కత్తికి మరింత పదును పెట్టి సరికొత్తగా వేటు వేయటానికి ప్లాన్ సెట్ చేశారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. తాను జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై కోర్టుల నుంచి ఎదురుదెబ్బలు ఎదురైన వేళ.. కొన్ని మార్పులతో బ్రాండ్ న్యూ ఆర్డర్ ను త్వరలో విడుదల చేయనున్నట్లుగా ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ లో మీడియాకు చెప్పటం గమనార్హం.

భద్రతా కారాణాల రీత్యా ఇమ్మిగ్రేషన్ బ్యాన్ ఆర్డర్ చాలా కీలకమైనదని.. దీనిపై చర్యను వేగంగా తీసుకుంటామనిట్రంప్ చెప్పిన తీరు చూస్తే.. ఆయన తయారు చేయిస్తున్న కొత్త చట్టం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చైనా అధ్యక్షుడితో మాట్లాడినప్పుడు చాలా మర్యాదగా మాట్లాడి .. ఆయనలోని కొత్త కోణాన్నిప్రపంచానికి పరిచయం చేసిన ట్రంప్.. కొత్త చట్టంతో ఏం చేయనున్నారన్నది ఇప్పుడు అందరిలోనూ కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
Tags:    

Similar News