మ‌న టెకీల‌కు ట్రంప్ ఇచ్చిన షాక్ ఇదే

Update: 2017-10-26 05:03 GMT
భార‌త టెకీల‌కు మ‌రో దుర్వార్త‌!.య‌థావిథిగా ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ద్వారానే! తరచూ వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ట్రంప్ భారత ఐటీ ఉద్యోగులకు షాకిచ్చేలా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. హెచ్‌-1బీ - ఎల్‌1 నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాల పొడిగింపు ప్రక్రియను కఠినతరం చేశారు. యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ సంస్థ (యూఎస్‌ సీఐఎస్‌) ఈ మేర‌కు క్లారిటీ ఇచ్చింది.

యూఎస్‌ సీఐఎస్ తెలిపిన వివరాల ప్రకారం..ఇకపై హెచ్‌-1బీ - ఎల్‌1 తరహా నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాల్ని పొడిగించుకోవాలని భావించేవారు అందుకు తగిన ఆధారాలు చూపించాలి. తమ అవసరం అమెరికాకు ఉందని నిరూపించాలి. ఇందుకు సంబంధించి 13 ఏళ్ల‌ నుంచి అమలవుతున్న విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై అన్ని బాధ్యతలు దరఖాస్తుదారుపైనే ఉంటాయని తెలిపింది. 2004 - ఏప్రిల్‌ 23నుంచి అమలవుతున్న విధానం తాజా ఉత్తర్వులతో మారిపోయింది. పాత విధానం ప్రకారం గతంలో ఎవరైనా వర్క్‌ వీసాకు అర్హత సాధించివుంటే వారికి వీసా పొడిగింపు సౌలభ్యం ఉండేది. వీసా పొడిగింపులో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. కొత్త విధానం ప్రకారం వీసా పొడిగింపు చేసుకోవాలనుకునే వారు అందుకు అర్హులని నిరూపించుకోవాలి. అమెరికాకు తమ అవసరం ఉందని రుజువు చేయాలి.

కాగా, ఇప్పటి వరకు అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకే ఈ నిబంధనలు వర్తిస్తాయని అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు విలియం స్టాక్‌ తెలిపారు. ఇకపై నిరూపణ భారమంతా దరఖాస్తుదారులపైనే ఉంటుందన్నారు. అర్హులైన ఇమ్మిగ్రెంట్స్‌ కు మాత్రమే అమెరికాలో ఉద్యోగాలు కల్పించాలని ట్రంప్‌ భావిస్తున్నారని యూఎస్‌ సీఐఎస్‌ పేర్కొన్నది. అందుకే, హెచ్‌-1బీ - ఎల్‌1 వీసాల పొడిగింపులో సవరణలు చేశారని తెలిపింది.
Tags:    

Similar News