పవన్ పాలిటిక్స్ అంతా నేషనల్ హైవే మీదనే ?

జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో గత నాలుగు రోజులుగా బిజీగా గడిపారు.

Update: 2024-11-29 03:33 GMT

జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో గత నాలుగు రోజులుగా బిజీగా గడిపారు. ఆయన ఎపుడూ ఇన్ని రోజులు ఢిల్లీలో ఉండలేదు. ఈసారి పవన్ ఢిల్లీ ట్రిప్ ప్రత్యేకమైనది అని అంటున్నారు. ఆయన ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీతో అరగంట పాటు భేటీ వేశారు. వన్ టూ వన్ గా సాగిన ఈ భేటీలో ఇద్దరూ ఏమి చర్చించారు అన్న ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

మరో వైపు అరడజన్ మందికి పైగా కేంద్ర మంత్రులను పవన్ కలుసుకుని రాష్ట్ర సమస్యల మీద చర్చించారు. విన్నపాలు చేశారు. అదే సమయంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ ని అయన కలసారు. ఇది మర్యాదపూర్వకమైన భేటీగా జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో పాటుగా పవన్ ఢిల్లీలో భారీ విందుని ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎన్డీయేకు చెందిన కీలకమైన మంత్రులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు హాజరు అయ్యారు. అంతే కాదు బీజేపీకి చెందిన అతి ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు.

పవన్ ఢిల్లీ టూర్ లో ఎందుకు ఈ విధంగా విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు అన్న దాని మీద చర్చ సాగుతోంది. పవన్ డిప్యూటీ సీఎం అయిన తరువాత మొదటి నాలుగైదు నెలలూ ఢిల్లీకి వెళ్లలేదు. ఇక ఆయన ఇదే నవంబర్ నెలలో తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కలిశారు. ఆయనతో చర్చలు జరిపారు.

ఇపుడు చూస్తే కేవలం పదిహేను రోజులు తేడాలో మరోసారి ఢిల్లీకి వెళ్లారు. ఈసారి ఎక్కువ రోజులే ఢిల్లీలో పవన్ ఉన్నారు. ఇక పవన్ ఎన్నడూ లేని విధంగా విందు ఇవ్వడం కూడా అతి పెద్ద చర్చగా ఉంది. ఏపీలో కూడా పవన్ విందు ఎపుడూ ఇచ్చినది లేదు. ఆయన ఆరు నెలల క్రితం ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అయినా సరే ఆయన ఈ తరహా రాజకీయాలకు తావు ఇవ్వలేదు.

కావాలీ అనుకుంటే పవన్ ఏపీలో విందు మీట్ పెడితే సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. కానీ పవన్ అలా చేయలేదు. నిజానికి పవన్ కి ఇలాంటివి ఇష్టం ఉండవని అంటారు. అటువంటి పవన్ ఈ విధంగా చేశారు అంటే కచ్చితంగా ఆయన ఒక మాస్టర్ ప్లాన్ తోనే ఈ విధంగా చేశారా అన్న చర్చ ఢిల్లీ స్థాయిలో జరుగుతోంది.

నిజానికి రెండు నెలల క్రితం లడ్డూలలో కల్తీ జరిగింది అన్న ఇష్యూ మీద పవన్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలతోనే జాతీయ మీడియాను ఆకట్టుకున్నారు. అంతే కాదు, ఆయన సనాతన ధర్మ బోర్డు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలి అన్న డిమాండ్ తో తిరుపతితో పెట్టిన సభ అనంతరం వారాహి డిక్లరేషన్ తో జాతీయ మీడియా డిబేట్లలో బాగా చర్చలోకి వచ్చారు.

ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ బీజేపీకి దాని మిత్రులకు చేసి పెట్టిన ప్రచారం అయితే వేరే లెవెల్ అని అంటున్నారు. పవన్ చేసిన ఈ ప్రచారంతో బీజేపీ మిత్రులు పూర్తిగా విజయం సాధించారు. అంతే కాదు పవన్ ప్రభావం మహారాష్ట్ర ఎన్నికలలో బాగా పడిందని దాని ఫలితంగా మిగిలిన చోట్ల కూడా మంచి మెజారిటీలు అందరికీ దక్కాయని అంటున్నారు.

ఈ క్రమంలో పవన్ పాపులారిటీ మరోసారి జాతీయ స్థాయిలో మారు మోగింది. ఈ పరిస్థితుల మధ్య పవన్ ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ నేషనల్ మీడియా అటెన్షన్ కూడా మొత్తం పవన్ మీదనే ఉంది. మరో వైపు పవన్ ఇచ్చిన విందుకు కేంద్ర స్థాయిలో పెద్దలు అంతా హాజరు కావడంతో జాతీయంగా పవన్ చరిష్మా వెలిగిపోతోంది

పవన్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఇపుడు జాతీయ స్థాయిలో తన పలుకుబడిని చాటుకుంటున్నారు. బీజేపీ కూడా ఆయనను బాగా ప్రొజెక్ట్ చేస్తోంది. దానితో పవన్ నేషనల్ లెవెల్ లో తన హవాను చూపిస్తున్నారు. ఏది ఏమైనా రానున్న రోజులలో పవన్ పాలిటిక్స్ అంతా నేషనల్ హైవే మీదనే అని అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ చుట్టూ మీడియాతో పాటు దేశ రాష్ట్ర రాజకీయం తిరగాల్సిందే అని అంటున్నారు. బీజేపీ పెద్దలు సైతం పవన్ తో పాటు ఉన్నారని మొత్తానికి పవన్ కి 2024లో అంతా కలసివచ్చేట్లుగానే ఉందని అంటున్నారు.

Tags:    

Similar News