ట్రంప్.. హిల్లరీ ఇద్దరూ అమెరికన్లకు నచ్చట్లేదు

Update: 2016-06-16 16:43 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఒక ఆసక్తికర కోణం తాజాగా బయటకు వచ్చింది. ఇటీవలే ప్రైమరీ ఎన్నికల పర్వం ముగిసి.. మరో నెలలో రిపబ్లికన్లు.. డెమోక్రాట్లు తమ తుది అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించనున్న సమయంలో ఒక సర్వే భారీ షాక్ ను ఇచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ల తరఫున డోనాల్డ్ ట్రంప్.. డెమోక్రాట్ల తరఫున హిల్లరీ క్లింటన్ బరిలో ఉండనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఇద్దరు నేతల అభ్యర్థిత్వంపై అమెరికన్లు అసలేమనుకుంటున్నారన్న విషయంపై ఏబీసీ న్యూస్ – వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఒక సర్వే నిర్వహించింది.

ఈ సర్వే ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. దీని ప్రకారం.. ప్రతి పది మంది అమెరికన్లలో ఏడుగురు అమెరికన్లు ట్రంప్ ను వ్యతిరేకిస్తున్నట్లు తేలింది. అదే సమయంలో హిల్లరీ పరిస్థితి ఏ మాత్రం మెరుగ్గా లేకపోవటం గమనార్హం. గడిచిన ఇరవైఏళ్లలో ఆమెకు ఎప్పుడూ లేనంత తక్కువ ఆదరణ లభిస్తున్నట్లు తాజా సర్వే తేల్చింది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత నుంచి ట్రంప్ ఇప్పుడు ఎదుర్కొంటున్న తీవ్రమైన వ్యతిరేకత గతంలో మరెప్పుడూ ఎదుర్కోలేదని తేలింది.

ఇక.. హిల్లరీక్లింటన్ విషయానికి వస్తే.. ఆమెకు అనుకూలంగా 43 శాతం మంది ఉంటే.. వ్యతిరేకంగా 55 శాతం మంది ఉండటం గమనార్హం. 1984 తర్వాత అమెరికన్లు.. అధ్యక్ష బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల్ని ఇంత తీవ్రంగా వ్యతిరేకించటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. మొత్తానికి తమకు ఏ మాత్రం ఇష్టం లేని దొందూ దొందులాంటి ఇద్దరు అధ్యక్ష అభ్యర్థుల్లో ఎవరికి అధ్యక్ష పీఠాన్ని కట్టబెడతారో..?
Tags:    

Similar News