‘మీడియా’కు కొత్త కొత్త పేర్లు పెట్టిన ట్రంప్

Update: 2016-08-02 08:21 GMT
వివాదాస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడుతూ నిత్యం మీడియాలో దర్శనమిస్తే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తాజాగా మీడియాపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. అమెరికాలోని పలు మీడియా సంస్థలు తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లుగా ఆరోపించిన ఆయన.. పలు ప్రముఖ మీడియా సంస్థలపై నోరు పారేసుకున్నారు. ఒహియోలో నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడిన ఆయన మీడియాపై దుమ్మెత్తిపోశారు.

ప్రఖ్యాత మీడియా సంస్థలైన సీఎన్ ఎన్ ను ‘క్లింటన్ న్యూస్ నెట్ వర్క్’గా అభివర్ణించారు. ఇక.. న్యూయార్క్ టైమ్స్ ను నిజాయితీ లేని సంస్థగా వ్యాఖ్యానించిన ఆయన.. ఆ మీడియా సంస్థ నిజాయితీ లేకుండా వ్యవహరిస్తుందని.. రానున్న మూడేళ్లలో ఆ సంస్థ ఉనికిలో లేకుండా పోతుందంటూ జోస్యం చెప్పారు. నిత్యం ట్రంప్ చెడ్డోడు అని చెప్పటమే పనిగా పెట్టుకున్నారన్న ఆయన.. హిల్లరీ క్లింటన్ లాంటి కుటిల బదుధి ఉన్న నేత గురించి గొప్పగా రాస్తున్నారని మండిపడ్డారు.

తాను ఇంటర్వ్యూలు ఇవ్వని పక్షంలో మీడియా సంస్థల రేటింగ్ లు పడిపోతున్నట్లుగా చెప్పుకున్న ట్రంప్.. తనకు మీడియా సహకరించకున్నా సోషల్ మీడియాలో తాను చెప్పాలనుకున్నది చెబుతానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన ట్విట్టర్.. ఫేస్ బుక్ అకౌంట్లలో 22.5 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారని.. వారికి తాను చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పనున్నట్లుగా వెల్లడించారు.

అమెరికాలోని మీడియా సంస్థల్లో ఫాక్స్ మీడియా సంస్థ తప్పించి మిగిలిన మీడియా సంస్థలన్నీ నిజాయితీగా వ్యవహరించటం లేదని.. ఫాక్స్ న్యూస్ మాత్రమే కచ్ఛితమైన సమాచారాన్ని అందిస్తోందని చెప్పుకొచ్చారు. తనకు అనుకూలంగా వార్తలు అందిస్తున్న వాషింగ్టన్ పోస్ట్ వ్యవహారం మీద స్పందించిన ఆయన.. కాస్త ఆలస్యంగా వాషింగ్టన్ పోస్ట్ నిద్ర మేల్కొందని వ్యాఖ్యలు చేయటం గమనార్హం. మీడియా మీద ఒక స్థాయిలో విరుచుకుపడిన ట్రంప్.. ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ మరెన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తారో..?
Tags:    

Similar News