భారతీయుల్ని మరోసారి హేళన చేశాడు

Update: 2016-04-24 04:56 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి భారతీయుల మీద తన అక్కసును ప్రదర్శించారు. అయితే.. భారతదేశాన్ని పొగుడుతున్నట్లుగా మాట్లాడిన అతగాడు.. భారతీయుల్ని హేళన చేయటం గమనార్హం. భారతీయుల యాసతో మాట్లాడిన ఎక్కెసం చేసేశాడు. భారత్ గొప్ప దేశమని.. భారత్ పట్ల తనకు ఎలాంటి కోపం లేదన్న ట్రంప్.. బుద్ధిలేని అమెరికా నేతల కారణమంటూ భారతీయుల మీద విమర్శనాస్త్రాల్ని సంధించటం గమనార్హం.

అమెరికాలో బ్యాంకింగ్.. క్రెడిట్ కార్డులకు ముఖ్యకేంద్రమైన డెలవేర్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారతీయుల్ని లక్ష్యంగా చేసుకున్నారు. తన క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ తో తాను మాట్లాడానని.. తాను పొందుతున్న సేవలు ఎవరు నిర్వర్తిస్తున్నారో చూసినప్పుడు.. తనకు సేవలు అందిస్తున్నది భారతీయుడని చెప్పుకొచ్చారు. ‘‘వారికి ఎందుకు ఈ పని అప్పగించాలి. భారత్ గొప్ప దేశం. ఆ దేశ నాయకుల మీద ఎలాంటి ద్వేషం లేదు. కానీ.. బుద్ది లేని మన నేతలపైనే నా కోపం. భారత్.. చైనా.. మెక్సికో.. జపాన్ వలసవాద విధానాలకు అడ్డుకోవాలి’’ అంటూ మండిపడ్డారు.

భారతీయుల్ని లక్ష్యంగా చేసుకొని ట్రంప్ విమర్శలు చేయటం ఇదేమీ కొత్త కాదు. అమెరికాలోని ఉపాధి అవకాశాల్ని భారత్.. చైనా తదితరదేశాల వారు కొల్లగొట్టేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసే ట్రంప్.. అమెరికన్లు పొందే సేవల్ని అమెరికన్లకే అప్పగించాలన్నది ట్రంప్ డిమాండ్లలో ఒకటి. ఇలాంటి ట్రంప్ కానీ అమెరికా అధ్యక్ష స్థానంలోకి వస్తే కష్టమే.
Tags:    

Similar News