ఇండియా, పాకిస్థాన్‌.. మ‌ధ్య‌లో ట్రంప్‌

Update: 2017-04-04 10:50 GMT
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి భార‌తీయులు అభిప్రాయం మార్చుకోవాల్సి వ‌స్తుందేమో! తాజాగా తెర‌మీద‌కు వ‌చ్చిన అధికారిక స‌మాచారం దీన్ని నిజం చేసేలా ఉంది మ‌రి! సుదీర్ఘ కాలంగా ర‌గులుతున్న ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను త‌గ్గించ‌డానికి అమెరికా త‌న వంతు పాత్ర పోషిస్తుంద‌ని ఆ దేశం స్ప‌ష్టంచేసింది. రెండు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌ల ప్ర‌క్రియ మొద‌లైతే.. అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని ఐక్య‌రాజ్య‌స‌మితికి అమెరికా రాయ‌బారిగా ఉన్న నిక్కీ హేలీ వెల్ల‌డించారు.

ఇండోపాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లపై అమెరికా ప్రభుత్వం కూడా ఆందోళ‌న‌గానే ఉంద‌ని చెప్పారు. రెండు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌ల్లో పాల్గొన‌డానికి అమెరికా ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని, ఉద్రిక్త‌త‌ల‌ను తగ్గించ‌డంలో త‌మ వంతు పాత్ర పోషిస్తామ‌ని హేలీ స్ప‌ష్టంచేశారు. ఏదో జ‌రిగే వర‌కు తాము వేచి చూడాల‌ని అనుకోవ‌డం లేద‌ని హేలీ అన్నారు.ఈ చ‌ర్చ‌ల్లో భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్యులు పాల్గొంటారు. అధ్య‌క్షుడు ట్రంప్ పాల్గొన్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు అని ఆమె అన్నారు. గ‌తంలో ఎన్న‌డూ రెండు దేశాల మ‌ధ్య త‌ల‌దూర్చ‌ని అమెరికా.. ఇప్పుడు మాత్రం ఇలాంటి వైఖ‌రి వ్యక్తం చేయ‌డం విశేష‌మే.

ఏప్రిల్ నెల‌కుగాను భ‌ద్ర‌తా మండ‌లి అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత హేలీ మీడియాతో మాట్లాడారు.  ట్రంప్ కేబినెట్‌లో చేరిన తర్వాత ఇండోపాక్ సంబంధాల‌పై హేలీ స్పందించ‌డం ఇదే తొలిసారి. గ‌త ఒబామా ప్ర‌భుత్వం ఈ అంశంపై స్పందించ‌లేదు. ఇది ఇండియా, పాక్ దేశాల‌కు సంబంధించిన విష‌య‌మ‌ని, చ‌ర్చ‌ల‌పై ఆ దేశాలే నిర్ణ‌యం తీసుకోవాల‌న్న వైఖ‌రిని ప్ర‌ద‌ర్శించింది. అయితే పాక్‌తో చ‌ర్చ‌ల్లో యూఎన్‌, అమెరికాతోపాటు ఎవ‌రి మ‌ధ్య‌వ‌ర్తిత్వం త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని భార‌త్ ఇప్ప‌టికే స్ప‌ష్టంచేసింది. మ‌రోవైపు పాక్ మాత్రం క‌శ్మీర్ వివాదాన్ని ప‌రిష్క‌రించ‌డానికి అటు యూఎన్‌, ఇటు అమెరికా ఇద్ద‌రి మ‌ధ్య‌వ‌ర్తిత్వం అవ‌స‌ర‌మ‌ని భావిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News