మోడీని పొగుడుతూ ట్రంప్ ఏమన్నారంటే..

Update: 2016-11-17 09:46 GMT
మాటలతో మంట పుట్టించటం డోనాల్డ్ ట్రంప్ కు అలవాటే. ఆయన నోట్లో నుంచి తీవ్ర విమర్శలు.. దూషణలే తప్పించి మరో మాట రాదని చాలామంది విమర్శిస్తారు కానీ.. ఆయన అప్పుడప్పడు తనకు నచ్చిన వారిని విపరీతంగా పొగిడేస్తుంటారు కూడా. హిల్లరీ కానీ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైతే చాలా బాగుంటుందన్న భావన చాలామందిలో ఉన్నా.. ట్రంప్ గెలిచినా కూడా ఏం ఫర్లేదన్న సంకేతాలు తాజాగా వస్తున్నాయి. ఇందుకు తగ్గట్లే ప్రధాని మోడీని అమెరికా అధ్యక్ష పదవిని త్వరలో చేపట్టనున్న ట్రంప్ పొగిడేసిన తీరు చూస్తే.. భారత్ తో చక్కటి సంబంధాల్ని ట్రంప్ కోరుకున్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

తాజాగా తన బిజినెస్ పార్టనర్స్ తో సమావేశమైన ట్రంప్.. ప్రధాని మోడీని పొగిడేసినట్లుగా వారు చెబుతున్నారు. ట్రంప్ కు చెందిన పలు బిజినెస్ ప్రాజెక్టులు ఇండియాలో జరుగుతున్నాయి. ఇండియాలో ట్రంప్ కు చెందిన కంపెనీకి ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో ట్రంప్ టవర్ ఒకటి. దీన్ని పూణెలో పంచశిల రియాలిటీ సంస్థతో నిర్మిస్తున్నారు. 46 అంతస్థుల్లో నిర్మిస్తున్న ఈ భారీ భవనంతో పాటు మరో 300 అపార్ట్ మెంట్లను ముంబయిలో నిర్మిస్తున్నారు.

త్వరలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ట్రంప్ తన వారసులు ఇవాంకా.. ఎరిక్.. డోనాల్డ్ ట్రంప్ లతో తన బిజినెస్ పార్టనర్స్ అయిన పంచశిల రియాలిటీ డైరెక్టర్ సాగర్ చోర్దియాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోడీ గొప్పగా పాలిస్తున్నారని.. ఆయన పని తీరు బాగుందంటూ కితాబు ఇచ్చారు. ట్రంప్ మాటలు వింటే.. అమెరికా.. భారత్ మధ్య సంబంధాలు బలపడతాయని.. మరింత విస్తరిస్తాయన్న భావన కలిగినట్లుగా చోర్దియా చెబుతున్నారు. ట్రంప్ మీద సందేహాలున్న భారతీయులకు ఈ సమాచారం సంతోషాన్ని కలిగిస్తుందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News