ట్రంప్ డే.. ఊరిస్తారా? ఊసురుమనిపిస్తారా?

Update: 2020-02-25 05:10 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చారు. తొలిరోజు పర్యటనను దిగ్విజయంగా ముగించుకున్నారు. మొతేరా స్టేడియంలో జనాన్ని చూసి పులకించారు. లక్షమందికిపైగా జనాలను చూసి సంతృప్తి చెందారు. సాయంత్రం తాజ్ మహల్ చూసి తన్మయత్వం చెందారు.

ఈ ఏడాది అమెరికాలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా తలపడే అవకాశమున్న బెర్ని శాండర్స్ ను ఓడించాలంటే అమెరికాలో స్థిరపడిన భారతీయుల ఓట్లు కీలకమని భావించిన ట్రంప్ అందుకే ఇండియా పర్యటనను దాన్ని అవకాశంగా మలుచుకున్నారు. తొలిరోజు స్పందన, భారత్ ను, భారతీయులను, మోడీని కీర్తించాక తన కష్టం ఫలించిందన్న విశ్వాసం ట్రంప్ లో కనపడింది.

ట్రంప్ ప్రసంగం పూర్తిగా గమనిస్తే జనాన్ని ఫిదా చేసేలా అందరినీ సంతృప్తిపరిచేలా ప్రవాసులు తనకు ఓట్లు కురిపించేలానే ఉంది. ట్రంప్ ప్రసంగాన్నిరూపొందించిన వారు భారతీయులను దృష్టిలో పెట్టుకొని అందరినీ సంతృప్తిపరిచేలానే తీర్చిదిద్దారని అర్థమైంది.

తొలిరోజును దిగ్విజయంగా ముగించిన ట్రంప్ రెండోరోజు మంగళవారం కీలకఘట్టానికి నాంది పలుకుతున్నారు. ఇరు దేశాధినేతల మధ్య వ్యూహాత్మక అంశాలపై చర్చలు జరగడంతోపాటు రెండు దేశాల అధికారులు ఈ రోజు కీలకమైన 300 కోట్ల డాలర్లపైనే ఒప్పందాలు చేసుకోనున్నారు.

అయితే ట్రంప్ పాకిస్తాన్ విషయంలో మొదట్లో కరుకుగా ఉండేవాడు. తాజా ప్రసంగంలో పాకిస్తాన్ చెప్పినట్టు చేస్తోందని నమ్మకమైన నేస్తంగా అభివర్నించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు పాకిస్తాన్ తో కలిసి పనిచేస్తామని.. భారత్ కు ముప్పులేకుండా చేస్తామన్నారు. తాలిబన్లతోనూ చర్చలు జరుపుతామన్నారు. ఇలా భారత్ పై ప్రేమే కాదు.. మన శత్రుదేశాన్ని వెనకేసుకురావడం చేశారు ట్రంప్. మరి ఈ ద్వంద్వ నీతిని మోడీ సార్ ఎలా తిప్పికొడుతారన్నది ఈరోజు భేటిలో కీలకంగా మారనుంది.

ఇక అన్నింటికంటే కీలకమైంది అమెరికాలో వలస నిబంధనలు రూపొందించడాన్ని మానుకోవాలి. భారతీయ ఎన్నారైలను ఇబ్బందుల్లో పడేసే ఈ నిర్ణయంపై మోడీ ఏం కోరుతారు? ట్రంప్ ఏమని హామీ ఇస్తాడన్నది ఈరోజు భేటిలో కీలకం.  దీనిపై స్పష్టమైన ప్రకటన వస్తేనే భారతీయులకు గొప్ప మేలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.


Tags:    

Similar News