ట్రంప్ మైండ్ సెట్ మారిందండోయ్

Update: 2016-05-12 09:53 GMT
ఇష్టారాజ్యంగా మాట్లాడే వ్యక్తికి బాధ్యత అప్పచెబితే అతడి మాటలో మార్పు వస్తుందంటారు. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్న డోనాల్డ్ ట్రంప్ వ్యవహారం కూడా ఇంచుమించు ఇదే రీతిలో ఉంది. బాధ్యత లేకుండా మాట్లాడేయటం.. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ట్రంప్ మాట తీరులో కాస్త తేడా వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ముస్లింలంటే అంతెత్తు ఎగిరిపడే అతను.. ఇప్పుడు అందుకు భిన్నంగా కాస్త ఆచితూచి మాట్లాడటం ట్రంప్ లో వచ్చిన కొత్త మార్పుగా చెప్పొచ్చు. మొన్నటి వరకూ ప్రైమరీ ఎన్నికల బరిలో ఉన్న సమయంలో మాటల తూటాల్ని ఇష్టారాజ్యంగా ప్రయోగించిన ట్రంప్.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఖరారు అవుతున్న నేపథ్యంలో ఆయన మాట తీరు మారటం గమనార్హం.

ముస్లింలను అమెరికాలోకి రానివ్వనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా లండన్ నగరానికి ముస్లిం మేయర్ గా ఎన్నికైన వ్యక్తిని అమెరికాకు రానిస్తానని చెప్పిన ట్రంప్.. తాజాగా ముస్లింల పట్ల తనకున్న సానుకూల వైఖరిని పదర్శించారు. మస్లింలకు ఇమ్మిగ్రేషన్ బ్యాన్ చేయాలని ఎన్నికల ప్రచారంలో చెప్పిన ట్రంప్.. అది సలహా మాత్రమే తప్ప అది విధానం కాదని చెప్పుకొచ్చారు. తాము చాలా తీవ్రమైన సమస్యలో ఉన్నందున నిషేధం తాత్కాలికంగా ఉంటుందని.. తాను చెప్పింది ఇప్పటివరకూ ఎవరూ చేయలేదని చెప్పిన ట్రంప్.. అది తన సలహా మాదిరే ఉంటుందని వ్యాఖ్యానించారు. ట్రంప్ తాజా మాటలు చూస్తుంటే.. మస్లింలకు తాను పూర్తి వ్యతిరేకమన్న ముద్రను పోగొట్టే ప్రయత్నాన్ని షురూ చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రైమరీ ఎన్నికల్లో మాదిరే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించటానికి ఇలాంటి మార్పు తప్పదన్న విషయంలో ఆయనకు ఒక స్పష్టత వచ్చిందేమో..?
Tags:    

Similar News