కిమ్ దూకుడు.. ట్రంప్ నోట శాంతి మంత్రం

Update: 2017-09-07 07:10 GMT
త‌న చేష్ట‌ల‌తో ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ తీరు ప్ర‌పంచానికి పెద్ద‌న్న లాంటి అమెరికా అధ్య‌క్షుడ్ని సైతం ఆచితూచి అడుగులు వేసేలా చేస్తోంది. తెంప‌రిత‌నంలో నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడే అంత పెద్ద ట్రంప్ సైతం కిమ్ విష‌యంలో తొంద‌ర‌ప‌డ‌కూడ‌ద‌న్న విష‌యాన్ని అర్థం చేసుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. త‌న తీరుతో  ప్ర‌త్య‌ర్థుల‌కు మంట పుట్టించే ట్రంప్.. మొద‌ట్లో కిమ్ విష‌యంలో దూకుడుగానే వ్య‌వ‌హ‌రించారు.

కానీ.. తాను అనుకున్నంత సింఫుల్ గా కిమ్ లెక్క తేల్చ‌లేమ‌న్న విష‌యం ట్రంప్ కు అర్థ‌మైన‌ట్లుగా క‌నిపిస్తోంది. కిమ్‌ను కెలికితే జ‌రిగే న‌ష్టం అగ్ర‌రాజ్యంతో స‌హా ప్ర‌పంచం మొత్తం కూడా భ‌రించ‌లేద‌న్న విష‌యాన్ని ఆయ‌న అర్థం చేసుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.  

అణ్వ‌స్త్రాల్ని ప్ర‌యోగించేందుకు సైతం వెనుకాడ‌మ‌న్న మాట‌నే ప‌దే ప‌దే వల్లె వేస్తున్న కిమ్‌.. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా అణుప‌రీక్ష‌ల్ని నిర్వ‌హిస్తున్నారు. ఉత్త‌ర‌కొరియా తీరుతో ప్ర‌పంచ దేశాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నా.. కిమ్ లెక్క చేయ‌టం లేదు. కిమ్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌పంచ దేశాల‌న్నీ ఏకం కావాలంటూ ఐక్య‌రాజ్య‌స‌మితి సైతం గ‌ళం విప్పుతున్న వేళ‌.. చైనా అధ్య‌క్షుడు పింగ్ కు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఫోన్ చేయ‌టం గ‌మ‌నార్హం.

ఈ ఇరు అధినేత‌ల మ‌ధ్య‌న జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ‌ను ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ బ‌య‌ట‌పెట్టింది. దీని ప్ర‌కారం ఉత్త‌ర‌కొరియాపై ఉన్న‌ప‌ళంగా సైనిక చ‌ర్య‌లు చేప‌ట్ట‌మ‌ని ట్రంప్ పేర్కొన్న‌ట్లుగా వెల్ల‌డించింది. ఇటీవ‌ల కాలంలో నిర్వ‌హించిన అణుప‌రీక్ష‌ల అంశం ఇరువురు దేశాధినేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చింది.  సైనిక చ‌ర్య మీద చైనా అధ్య‌క్షుడు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ ట్రంప్‌.. అదేమీ త‌మ తొలి నిర్ణ‌యం కాద‌ని బ‌దులిచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

ఉత్త‌ర‌కొరియా మీద చ‌ర్య‌ల మీద ఇద్ద‌రు అధినేత‌లు ఒకే మాట మీద ఉన్న‌ట్లుగా స‌ద‌రు మీడియా సంస్థ వెల్ల‌డించింది. ఉత్త‌ర కొరియాలో ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యం బాహ్య ప్ర‌పంచానికి తెలీని ప‌రిస్థితి నెల‌కొంద‌ని.. అత‌న్ని అడ్డుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మాటను చైనా అధినేత ట్రంప్ తో చెప్పిన‌ట్లుగా స‌మాచారం. ప‌రిస్థితులు చేజారితే మాత్రం సైనిక చ‌ర్య‌ల‌ను చేప‌ట్టొచ్చ‌న్న అంశాన్ని ట్రంప్ స్ప‌ష్టం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఓవైపు ఉత్త‌ర కొరియా ర‌ణాని సిద్ధ‌మంటూ బీరాలు ప‌లుకుతుంటే.. అందుకు భిన్నంగా ట్రంప్ మాత్రం శాంతి మంత్రాన్ని జ‌పించ‌టం చూస్తుంటే.. ఇరాక్‌.. ఆఫ్ఘ‌నిస్తాన్ లాంటి దేశాల విష‌యంలో అమెరికా వ్య‌వ‌హ‌రించిన తీరుకు భిన్న‌మైన విధానాన్ని ఉత్త‌ర‌కొరియా విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు.


Tags:    

Similar News