ప్ర‌పంచం మెచ్చే రోజు - జూన్ 12

Update: 2018-05-11 16:28 GMT
వ‌చ్చేనెల‌లోనే...ప్ర‌పంచం ఊహించ‌ని ఘ‌ట‌న చోటుచేసుకోనుంది. ఇంకా చెప్పాలంటే..అసాధ్యం అనుకున్న‌ది కాస్తా ఆచ‌ర‌ణ రూపం దాల్చ‌నుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య చరిత్రాత్మక సమావేశం వచ్చేనెల 12న సింగపూర్‌ లో జరుగనుంది. ప్రచ్ఛన్న యుద్ద కాలం నుంచి ప్రత్యర్థులుగా ఉన్న అమెరికా - ఉత్తరకొరియా అధినేతల మధ్య ఇది తొలి సమావేశం కానుంది. ఉత్తర కొరియాలో ఖైదీలుగా ఉన్న ముగ్గురు అమెరికన్లతో విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియో గురువారం స్వదేశానికి చేరుకున్నారు. ఆండ్రూస్ మేరీలాండ్ వైమానిక దళ కేంద్రం వద్ద వారికి స్వయంగా ట్రంప్ స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు.

కొద్దికాలం క్రితం వ‌ర‌కు అమెరికా - ఉత్త‌ర‌కొరియాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. అణుదాడి బటన్ తన టేబుల్‌ పైనే ఉంటుందని కిమ్ అమెరికాకు హెచ్చరికలు జారీచేయడంతో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. దీనిపై ట్రంప్ స్పందిస్తూ తన వద్ద అంతకంటే పెద్ద అణు బటన్ ఉన్నదని తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ నేపథ్యంలో చర్చలకు రావాలని ఉత్తరకొరియాను దక్షిణకొరియా కోరింది. సంయుక్త సైనిక విన్యాసాలను వాయిదా వేయాలని అమెరికా, దక్షిణకొరియా నిర్ణయించడంతో చర్చలకు ఉత్తరకొరియా అంగీకరించింది. దక్షిణకొరియాతో చర్చలకు ఉత్తరకొరియా అంగీకరించడంతో ట్రంప్ తన దూకుడును తగ్గించారు. దక్షిణకొరియాలో జరిగే శీతాకాల ఒలింపిక్స్‌ లో పాల్గొంటామని కిమ్ ప్రకటించడంతో ట్రంప్ మెత్తబడ్డారు. అదే స‌మ‌యంలో ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ తో ఫోన్‌ లో మాట్లాడటానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాజాగా అమెరిక‌న్ల విడుద‌ల సంద‌ర్భంగా ట్రంప్ ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. తమ పౌరులను విడిచిపెట్టినందుకు కిమ్‌ను అభినందించిన ట్రంప్ తమ భేటీ వివరాలు చెప్పారు. ``కిమ్‌ తో జరిగే నా భేటీలో అత్యధిక ఫలితాలు సాధించగలమని భావిస్తున్నా. దీన్ని ప్రపంచ శాంతి కోసం చాలా ప్రత్యేక సందర్భంగా మార్చేందుకు ప్రయత్నిస్తాం`` అని ట్వీట్ చేశారు.
Tags:    

Similar News