ట్రంప్ వార్నింగ్‌.. కిమ్ లైన్‌ లోకొస్తాడా?

Update: 2017-09-04 09:02 GMT
త‌న దూకుడుతో అమెరికాను ఒణికించాల‌ని భావిస్తున్న ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ కి అగ్ర‌రాజ్యం అధ్య‌క్షుడు ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తర కొరియా ఆదివారం అధికారిక ప్రకటన చేయగానే ట్రంప్ ఆగ్ర‌హంతో ఊగిపోయారు. తాజా పరీక్షల నేపథ్యంలో ఉత్తరకొరియాపై కఠిన ఆంక్షలు విధిస్తూ కొత్త ముసాయిదాను రూపొందించాల‌ని త‌న ప‌రివారాన్ని ట్రంప్ ఆదేశించారు. అంతే ఇంకే ముంది.. రాజే త‌లుచుకున్న‌ప్పుడు.. ఇదే విష‌యాన్ని అమెరికా ఆర్థిక శాఖ ప్రకటించింది.

దాని ప్రకారం ఉత్తరకొరియాతో వ్యాపారం జరిపే ఏ దేశమైనా తమతో వ్యాపారం జరపడానికి కుదరదని ఆర్థిక మంత్రి తెలిపారు.  ఈ తాజా ఆంక్షలు.. అంతర్జాతీయంగా  కూడా తీవ్ర ప్రకంప‌న‌లు సృష్టించే అవకాశముంది.  నిజానికి ఉత్త‌ర కొరియాతో చైనా ఎక్కువ‌గా వ్యాపారం సాగిస్తోంది. అదేస‌మ‌యంలో ఉత్త‌ర కొరియా ఏం చేసినా కూడా వెన‌కేసుకువ‌స్తోంది. ఈ క్ర‌మంలో చైనాను లైన్‌ లో పెట్టేందుకే ట్రంప్ ప్ర‌భుత్వం ఇలా హెచ్చ‌రించి ఉంటుంద‌ని అంటున్నారు. ముందు  చైనాను దెబ్బతీస్తే ఉత్తరకొరియా ఆటలు సాగబోవని ట్రంప్ ప్లాన్ వేసి ఉంటార‌ని స‌మాచారం.

విదేశీ వాణిజ్యం విషయంలో ఉత్తరకొరియా 90 % వరకూ చైనా పైనే ఆధారపడుతోంది. ఇరు దేశాల మధ్య ఉన్న సంత్సంబంధాల దృష్ట్యా ఇప్పటికిప్పుడు పూర్తి వాణిజ్య సహకారాలను కాదనుకునే పరిస్థితి లేదు. ట్రంప్ చెప్పిన నిబంధన మేరకు.. చైనాతో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను అమెరికా వదులుకోవాల్సి ఉంటుంది. రెండు దేశాల మధ్య ప్రతియేటా వందల బిలియన్ల డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతోంది. దీన్ని కాదనుకుంటే... రెండు దేశాలకు మాత్రమే కాదు.. అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.  అయితే, ఈ క్ర‌మంలో చైనాకే ఎక్కువ నష్టం కలిగే అవ‌కాశం ఉంది.

 ఇక‌, ఇదే విష‌యంలో భార‌త్ కూడా ఉత్త‌ర కొరియాకూ వ్యూహాత్మ‌క వాణిజ్య స‌హ‌కారం అందిస్తోంది. సుమారు 75% ఉత్ప‌త్తులు భార‌త్ నుంచి ఉత్త‌ర కొరియాకు ఎగుమ‌తి అవుతున్నాయి. అందుకే ఉత్త‌ర కొరియా విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు. అమెరికాకు ఈ విష‌యంలో భార‌త్‌పై కోపం ఉండి ఉండొచ్చు. ఇప్పుడు ఇలా ఆంక్ష‌లు పెడితే - ఆసియాలో అతి పెద్ద దేశం భార‌త్ కూడా ముందుకు వ‌చ్చి కిమ్‌ పై విరుచుకుప‌డుతుంద‌ని, త‌ద్వారా స‌మ‌స్య ప‌రిష్కారం తొంద‌ర‌గా జ‌రుగుతుంద‌ని ట్రంప్ భావిస్తుండ‌వ‌చ్చు. అయితే, ట్రంప్ ఆలోచ‌న‌లు ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతాయో చూడాలి.


Tags:    

Similar News