కిల్లికి జగన్ ఆ దారి చూపిస్తున్నారా...?

Update: 2022-08-23 02:30 GMT
శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్, వైసీపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని ఇప్పటిదాకా వార్తలు వచ్చాయి. ఆమె సరైన టైమ్ చూసుకుని వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేస్తారు అని కూడా ప్రచారం జరిగింది. అయితే కిల్లి మాత్రం పెద్దగా సౌండ్ చేయకుండా తమ పని ఏమిటో తాను చూసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో కిల్లికి వైసీపీ నుంచి సరైన హామీ లభించింది అని అంటున్నారు.

ఆ హామీ ఏమిటీ అంటే వచ్చే ఎన్నికల్లో ఆమెను శ్రీకాకుళం ఎంపీ సీటుకు పార్టీ తరఫున పోటీ చేయిస్తారు అని అంటున్నారు. కిల్లి అయితేనే కింజరాపు ఫ్యామిలీని ఓడించగలరని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు. కిల్లి 2009 ఎన్నికల్లో నాటి టీడీపీ సీనియర్ నేత కింజరాపు ఎర్రన్నాయుడుని ఓడించి జెయింట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ మీదట ఆమె కేంద్ర మంత్రి కూడా అయ్యారు.

ఇపుడు కూడా ఆమెనే ముందు పెడితే ఆ సెంటిమెంట్ కలసివస్తుంది అని వైసీపీ ప్లాన్ చేస్తోంది. శ్రీకాకుళం ఎంపీ గా రెండు సార్లుగా ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు గెలిచి సత్తా చాటారు. 2024లో కూడా ఆయనకే టికెట్ అంటున్నారు. అంటే మూడవసారి అన్న మాట. మరి ఆయన ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. తండ్రి ఎర్రన్నాయుడు అయితే వరసగా నాలుగు సార్లు ఎంపీ సీటు నుంచి గెలిచి అయిదవ సారి ఓడారు.

మరి కుమారుడికి అదే సెంటిమెంట్ కంటిన్యూ అయితే ఈజీగా ఈసారి గెలవాలి. కానీ వైసీపీ మాత్రం రామ్మోహన్ ని ఓడించేందుకు గట్టి పట్టుదల మీద ఉంది. దాంతో కిల్లి కృపారాణికి ఈ మ్యాటర్ చెప్పి రెడీగా ఉండమని కోరినట్లుగా తెలుస్తోంది. దాంతో ఆమె ఇపుడు శ్రీకాకుళం లోని అన్ని ఎమ్మెల్యే సీట్లలో టూర్లు పెట్టుకున్నారు అని అంటున్నారు. కిల్లికి ఎంపీగా వెళ్ళాలని ఉంది. అయితే ఆమె రాజ్య సభ కోరుకున్నారు.

కానీ హై కమాండ్ మాత్రం ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే ఆమెను పార్లమెంట్ కి పంపాలని చూస్తోంది. ఈ విషయాన్ని ఆమెకు వివరించి ఆమెతో ఓకే చేయించుకున్నారు అని అంటున్నారు. కిల్లి కూడా ఇపుడు వైసీపీ తరఫునే పోటీకి దిగాలని భావిస్తున్నారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే వైసీపీ తరఫున సర్వశక్తులూ ఒడ్డి జూనియర్ ఎర్రన్నాయుడుని ఆమె ఓడించి తీరుతారా అన్నదే ఆసక్తికరమైన చర్చగా ఉంది.
Tags:    

Similar News