స్పుత్నిక్ వ్యాక్సిన్ పై డాక్టర్ రెడ్డీస్ కీలక ప్రకటన

Update: 2021-05-29 04:53 GMT
మోస్ట్ అవేటింగ్ వ్యాక్సిన్ గా ప్రచారం సాగుతున్న స్పుత్నిక్ టీకాను దేశీయంగా హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ దిగుమతితో పాటు.. ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని అనుకున్నట్లు జరిగితే.. 25 కోట్ల డోసుల్ని సదరు కంపెనీ చేయనుంది. దీనికి సంబంధించి రష్యాతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ లో స్పుత్నిక్ ప్రభావ స్కోర్ ఎక్కువగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో.. దీనిపై అమితమైన ఆసక్తి వ్యక్తమవుతోంది.

ఏ విషయంలో ప్రజలకు ఎక్కువ ఆసక్తి ఉంటుందో.. దాన్ని మాయ చేయటం ద్వారా మోసానికి పాల్పడే ఉదంతాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. దీనికి తగ్గట్లే.. స్పుత్నిక్ వ్యాక్సిన్ మీద సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ చిత్రమైన వాదనలు.. వార్తలు వస్తున్నాయి.

వ్యాక్సిన్ సరఫరా బాధ్యతల్ని పలు కంపెనీలతో పాటు.. థర్డ్ పార్టీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. అపార్ట్ మెంట్లకు.. గేటెడ్ కమ్యునిటీలకు వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు కొన్ని కంపెనీలతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందాలు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వేళ.. డాక్టర్ రెడ్డీస్ స్పందించారు. తాము ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

దీని పరకారం.. స్పుత్నిక్ - వి వ్యాక్సిన్ బ్రాండ్ సంరక్షణ బాధ్యత తమ కంపెనీదేనని.. పంపిణీ హక్కులు తాము ఏ కంపెనీకి ఇవ్వలేదని స్పష్టం చేసింది. జూన్ మధ్యలో స్పుత్నిక్ -వి వ్యాక్సిన్ వాణిజ్యపరమైన విడుదల వేళ.. భాగస్వామ్యం కోసం ప్రభుత్వ.. ప్రైవేటు సంస్థలతో నేరుగా తాము చర్చిస్తున్నట్లు చెప్పారు. తాము ఇతర కంపెనీలతో కానీ.. థర్డ్ పార్టీలతో కానీ భాగస్వామ్యం కుదుర్చుకోలేదన్నారు. అలాంటి ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ స్పష్టం చేసింది. ఒకవేళ.. ఎవరైనా తమ కంపెనీ ప్రతినిధులమని సంప్రదిస్తే అలాంటి వారిపై వెంటనే కంప్లైంట్లు ఇవ్వాలని కోరటం గమనార్హం.
Tags:    

Similar News