అమ‌ర్‌ నాథ్ దాడిలో బ‌స్సు డ్రైవ‌ర్ సాహ‌సం!

Update: 2017-07-11 13:49 GMT
ఆ డ్రైవ‌ర్ స‌మ‌య‌స్ఫూర్తి 50 మంది నిండు ప్రాణాల‌ను కాపాడింది. అమ‌ర్ నాథ్ లో ఉగ్ర‌దాడికి గురైన యాత్రికులు ప్ర‌యాణిస్తున్న‌ బ‌స్సు డ్రైవ‌ర్‌ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హరించ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. న‌లువైపుల నుంచి దూసుకు వ‌స్తున్న‌తూటాల‌ను లెక్క‌చేయ‌ని ఆ డ్రైవ‌ర్ బ‌స్సును ఆప‌కుండా ఉగ్ర‌వాదుల నుంచి కిలోమీట‌ర్ దూరం తీసుకెళ్ల‌డంతో ప్ర‌యాణికుల‌కు ముప్పు త‌ప్పిపోయింది. ఆ భ‌యాన‌క ఘ‌ట‌న గురించి బ‌య‌ట‌ప‌డ్డ క్ష‌త‌గాత్రురాలు ఆ వివ‌రాల‌ను మీడియాకు తెలిపింది.

తాము ప్ర‌యాణిస్తున్న బస్సుపైకి  ఒక్క‌సారిగా బులెట్ల దూసుకొస్తున్న‌ప్ప‌టికీ డ్రైవర్‌ బస్సును ఆపకుండా కిలోమీటర్‌ దూరం తీసుకొచ్చాడని ఆ ఘటనలో గాయపడిన మహారాష్ట్రకు చెందిన భాగ్యమణి తెలిపారు. ఆ స‌మ‌యంలో బ‌స్సు డ్రైవ‌ర్ స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించాడ‌ని తెలిపారు. అమర లింగేశ్వరుడిని దర్శించుకుని తిరిగి వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా.. దాడి జరిగిందని చెప్పారు. తన బంధువు నిర్మల ఇక లేదని తెలిసి ఆవేదనకు గురైనట్లు తెలిపారు.

ఉగ్ర‌దాడి ఘటనపై బస్సు డ్రైవర్‌ సలీమ్‌ బంధువు జావెద్‌ గుజరాత్‌ లో మీడియాతో మాట్లాడారు. సలీమ్‌ ఏడుగురి ప్రాణాలను కాపాడలేకపోయినా, 50 మందిని సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడ‌న్నారు. 9.30 గంటల ప్రాంతంలో ఆయన నాకు ఫోన్‌ చేసి దాడి గురించి చెప్పార‌ని తెలిపారు. యాత్రికులను రక్షించడం కోసమే బస్సును అక్కడ ఆపలేదని సలీమ్‌ ఫోన్లో చెప్పాడ‌ని జావెద్‌ అన్నారు.

జమ్ముకశ్మీర్‌ లోని అనంత్‌ నాగ్‌ జిల్లాలో సోమవారం రాత్రి అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. తొలుత సాయుధ కారుపై దాడి చేసిన ముష్కరులు.. ఆ తర్వాత విచక్షణ కోల్పోయి యాత్రికుల బస్సుపై కాల్పులు జరుపుతూ పరారయ్యారు. ఈ ఘటనలో ఏడుగురు యాత్రికులు మృతిచెందగా.. మరో 11 మంది గాయపడ్డారు.
Tags:    

Similar News