ప్రకాశం లో రూ.లక్ష కోట్లతో దుబాయ్ కంపెనీ

Update: 2015-08-11 04:47 GMT
ఏపీ ముఖచిత్రాన్ని మార్చే ఓ భారీ ప్రాజెక్టు తెర మీదకు వచ్చింది. దుబాయ్ కు చెందిన ఒక కంపెనీ ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టటానికి సిద్ధం అవుతోంది. పెట్రోరిఫైనరీ.. కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం రూ.లక్ష కోట్ల వరకూ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన చర్చలు వేగవంతంగా సాగటంతోపాటు.. ఫలప్రదం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

సదరు కంపెనీ అవసరాల కోసం.. సముద్ర తీరంలో సొంత పోర్టు కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉందని చెబుతున్నారు. ఈ కంపెనీ కానీ వస్తే.. ప్రత్యక్షంగా 50వేల ఉద్యోగాలతో పాటు.. వేలాది పరోక్ష ఉద్యోగాలు రావటంతో పాటు.. ఏపీ ముఖ చిత్రంపై సరికొత్త ముద్ర పడటం ఖాయమంటున్నారు. తమ ప్రాజెక్టులో భాగంగా దాదాపు 3వేల ఎకరాలు అవసరం అవుతాయని.. సముద్ర తీర ప్రాంతంలో భూములు కావాలని సదరు సంస్థ కోరుతున్నట్లు చెబుతున్నారు.

మొదట ఈ కంపెనీ నెల్లూరుజిల్లాలోని సముద్ర తీర ప్రాంతం మీద ఆసక్తి ప్రదర్శించగా.. ఇప్పటికే పలు ప్రాజెక్టులు వచ్చిన నేపథ్యంలో.. ప్రకాశం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించాలని ఏపీసర్కారు కోరినట్లు చెబుతున్నారు. సదరు కంపెనీ.. ప్రకాశం జిల్లా పట్ల ఆసక్తి ప్రదర్శిస్తోందన్నది తాజా సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇంత భారీ పెట్టుబడితో వస్తున్న కంపెనీ.. తనకు కావాల్సిన భూముల్ని ప్రభుత్వం ఉచితంగా కేటాయించనక్కర్లేదని.. మార్కెట్ ధర చెల్లించి సొంతం చేసుకునేందుకు ఆసక్తి ప్రదర్శిస్తుందని చెబుతున్నారు.

ఈ భారీ పెట్రో రిఫైనరీ.. కెమికల్.. పోర్టు ప్రతిపాదన కానీ వాస్తవ రూపం దాలిస్తే.. దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా ఈ ప్రాజెక్టు అవుతుందని చెబుతున్నారు. భారీ ఎత్తున పెట్టుబడులతోపాటు..ఉద్యోగ కల్పనకు అవకాశం ఉండటంతో.. ఏపీ సర్కారు ఈ ప్రాజెక్టు విషయంపై ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు అనుమతుల కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. ఈ భారీ ప్రాజెక్టు మాటల వరకేనా? వాస్తవరూపం దాలుస్తుందా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి.
Tags:    

Similar News