దుబ్బాక లో కాంగ్రెస్ కి భారీ షాక్ .. టీఆర్ఎస్ లో చేరిన కీలక నేతలు !

Update: 2020-10-09 15:30 GMT
దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన సీనియర్ నాయకులు నరసింహరెడ్డి, మనోహర్ రావులు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ ని వీడి టి ఆర్ ఎస్ లో చేరిపోయారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో వారు ఈ రోజు టీఆర్ ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. దాదాపుగా రెండు వేల మంది అనుచరులతో భారీ ర్యాలీతో వచ్చి వారు టీఆర్ ఎస్ లో చేరారు.

రాబోయే రోజుల్లో మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్ ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. అటు టికెట్ కోసం టీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి రాకను కూడా కొందరు కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపడుతున్నారు. కాగా దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న టీఆర్‌ ఎస్‌ నాయకులు సోలిపేట రామలింగారెడ్డి ఆగష్టులో మరణించిన విషయం విదితమే. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో నవంబరు 3న పోలింగ్‌ నిర్వహించనున్నారు.

ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్ధులను కూడా ప్రకటించాయి.. టీఆర్‌ ఎస్‌ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పోటిలో ఉన్నారు. నేటి నుంచి అక్కడ నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 16న నామినేషన్లకి చివరి తేది కాగా, అక్టోబర్ 19న ఉపసంహరణ చివరి తేదీగా ఉంది. ఇక నవంబర్ 3 న ఎన్నికలు జరగగా 10 న ఫలితాలు రానున్నాయి.
Tags:    

Similar News