కాపుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికేనా ద్వారంపూడి ఈ వ్యాఖ్య‌లు?

Update: 2022-07-05 04:33 GMT
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి 2009లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచారు. 2014లో ఓడిపోయిన ద్వారంపూడి 2019లో వైఎస్సార్సీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడిగా ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి పేరుంది. ప్ర‌త్య‌ర్థులు ఆయ‌న‌ను సీఎం జ‌గ‌న్ కు బినామీ అని ఆరోపిస్తుంటారు.

కాగా గ‌తంలో ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్, టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై బూతుల‌తో విరుచుకుప‌డ్డారు. ద్వారంపూడి వ్యాఖ్య‌లు రాష్ట్ర స్థాయిలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. అటు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, ఇటు టీడీపీ కార్య‌క‌ర్త‌లు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఆ త‌ర్వాత కూడా ఏమీ త‌గ్గ‌ని ద్వారంపూడి సంద‌ర్బం వ‌చ్చిన ప్ర‌తిసారీ స‌వాళ్లు విసురుతూ వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో కాపు సామాజిక‌వ‌ర్గంలో ద్వారంపూడిపై తీవ్ర వ్య‌తిరేక‌త ఏర్ప‌డింద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

దీంతో ద్వారంపూడి న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌కు దిగార‌ని అంటున్నారు. తాజాగా జూలై 4న వంగ‌వీటి రంగా 75వ జ‌యంతి ఉత్స‌వాల‌ను కాకినాడ‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌పై ద్వారంపూడి ప్ర‌శంస‌లు కురిపించారు.

వంగ‌వీటి రంగా పేద‌ల అభ్యున్న‌తి కోసం రాజీ లేని పోరాటాలు చేశార‌ని కొనియాడారు. ఆయ‌న ఒక్క కాపు కులానికి మాత్ర‌మే ప‌రిమితం కాద‌ని, బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు, పేద‌లంద‌రికీ దేవుడులాంటి వ్య‌క్తి అని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

రంగా ఒక శ‌క్తి అని కొనియాడారు. అలాగే రంగా త‌న‌యుడు వంగ‌వీటి రాధా ఎక్క‌డ ఉన్నా బాగుండాల‌ని కోరుకుంటాన‌ని, ఆయ‌న భ‌విష్య‌త్ అద్భుతంగా ఉండాల‌ని ఆశిస్తాన‌ని ద్వారంపూడి వ్యాఖ్యానించారు.

పేద‌ల పాలిట పెన్నిధి అయిన వంగ‌వీటి మోహ‌న్ రంగాను టీడీపీ అధినేత చంద్ర‌బాబు హ‌త్య చేయించాడ‌ని ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కాగా కాపు సామాజిక‌వ‌ర్గంలో త‌న‌పై వ‌చ్చిన తీవ్ర వ్య‌తిరేక‌త‌తోనే ద్వారంపూడి.. వంగ‌వీటి రంగా జ‌పం చేస్తున్నార‌ని చెబుతున్నారు. త‌ద్వారా త‌న‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను తొల‌గించుకోవ‌డానికే ఆయ‌న‌ను పొగుడుతున్నార‌ని అంటున్నారు.
Tags:    

Similar News