వచ్చేసిన ఈ-రూపీ .. ఎలా పని చేస్తుందంటే ?

Update: 2021-08-03 07:30 GMT
డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వీలుగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇ-రూపీని ఆవిష్కరించారు. సోమవారం వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ లో ఎలక్ట్రానిక్‌ వోచర్‌ ఇ-రూపీని ప్రధాని విడుదల చేశారు. డిజిటల్‌ లావాదేవీలు, నేరుగా నగదు బదిలీ విషయంలో ఇ-రూపీ దేశంలో కీలకపాత్ర పోషించనుందని ఆయన పేర్కొన్నారు. పారదర్శకంగా నగదు చెల్లింపులు చెయ్యొచ్చ న్నారు. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో 21వ శతాబ్దంలో భారత్‌ ముందుకు వెళ్తున్న తీరుకు ఇ-రూపీని ఉదాహరణగా చెప్పవచ్చు అని తెలిపారు.

క్యూర్‌ ఆర్‌ కోడ్‌ లేదా ఎస్‌ ఎంఎస్‌ రూపంలో ఈ వోచర్‌ ను లబ్ధిదారుల మొబైల్‌ కు పంపవచ్చు అని తెలిపారు. దీన్ని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ పిసిఐ), ఆర్థిక సేవల శాఖ, మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు ఎన్‌ పిసిఐతో ఒప్పందం చేసుకోవడం ద్వారా ఇ-రూపీని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటియం లాంటి థర్డ్‌ పార్టీ వాలెట్‌ యాప్స్‌ ఏవీ అవసరం లేకుండానే దీన్ని ఉపయోగించుకోవచ్చు. వినియోగదారుల వద్ద కేవలం ఇ-రూపీకి సంబంధించిన ఎస్‌ ఎంఎస్‌ కానీ.. క్యూఆర్‌ కోడ్‌ కానీ ఉంటే చాలు ఎక్కడైనా చెల్లింపులు చేసుకోవడానికి వీలుంది.

ప్రభుత్వాలు ప్రారంభించే సంక్షేమ పథకాల చెల్లింపులను ఇ-రూపీ ద్వారా లబ్ధిదారులకు అందించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఇ–రూపీ సదుపాయం ఆరోగ్య సేవలకు అందుబాటులో ఉంటుంది, రానున్న కాలంలో ఇతర విభాగాలకు కూడా దీన్ని విస్తరించనున్నారు. ఆయుష్మాన్‌ భారత్, ఎరువుల సబ్సిడీ వంటి వాటికి కూడా కూడా దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. యూపీఐ ప్లాట్ ఫామ్ ఆధారంగా బ్యాంకుల ద్వారా ఎన్సీపీఐ ఈ-రూపీని జారీ చేస్తుంది. భాగస్వామ్య బ్యాంకులను ఏదైన కార్పొరేట్, ప్రభుత్వ ఏజెన్సీలు సంప్రదించి నిర్దేశిత వ్యక్తి, పేమెంట్స్ పర్పస్ను  తెలియజేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులను మొబైల్ నంబర్ల ద్వారా గుర్తించి.. ఈ-రూపీ ఓచర్లను బ్యాంకుల ద్వారా ఏజెన్సీలు జారీ చేస్తాయి. లబ్ధిదారుడి పేరుతోనే ఈ-రూపీ జారీ అవుతుంది.

ప్రభుత్వ ప్రయోజనాలను నిర్దేశిత లబ్ధిదారులకు, వృథా రహితంగా. లక్ష్యిత వర్గాలకు చేరేవిధంగా పలు పథకాలను గత కొన్నేళ్లుగా కేంద్రం ప్రవేశపెడుతూనే ఉంది. ఇప్పుడు అందుబాటులోకి తెచ్చిన ఎలక్ట్రానికల్‌ వోచర్‌ అనేది సుపరిపాలన విజన్‌ ను పెంపొందించడంలో మరింత తోడ్పాటును అందించనుంది. దీనివల్ల ఏ ప్రయోజనం కోసమైతే డబ్బును ఇచ్చారో, అదే పని కోసం కచ్చితంగా అది వినియోగించబడేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ వంటి నిర్దిష్ట ప్రయోజనాలను అవసరమైన వారికి చేరువ చేసేందుకు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ఈ లీకేజీ రహిత యంత్రాంగాన్ని ఉయోగించుకోవచ్చని వివరించారు. రాష్ట్రాలు కూడా సంక్షేమ పథకాలను నిర్దేశిత లబ్ధిదారులకు చేరువ చేసేందుకు ఇ–వోచర్‌ ను వినియోగించుకోవాల్సిందిగా ప్రధాని సూచించారు.

వంట గ్యాస్, రేషన్‌ సరుకులు అలాగే ఇతరత్రా సంక్షేమ పథకాలకు సంబంధించి సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లోకి వేయడం (డీబీటీ) ద్వారా భారీగా లీకేజీలకు అడ్డుకట్ట వేయగలిగామని, అదేవిధంగా నకిలీ లబ్ధిదారులను ఏరివేయగలిగామని ప్రధాని పేర్కొన్నారు. ప్రభుత్వం రూ.1.78 లక్షల కోట్ల మొత్తాన్ని ఆదా చేయడంలో ఇది ఎంతగానో తోడ్పడిందని ఆయన చెప్పారు. డిజిటల్‌ ఇండియా అనుసంధానం వల్ల ఒక్క క్లిక్‌ తో నేరుగా కోట్లాది మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేసేందుకు తోడ్పడిందని చెప్పారు. డీబీటీ ప్లాట్‌ ఫామ్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకూ కేంద్రం అందిస్తున్న 300కు పైగా స్కీములకు రూ.17.5 లక్షల కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు ప్రధాని వెల్లడించారు.

ఇకపోతే, ఈ-రూపీ కి, డిజిటల్ కరెన్సీకి తేడా ఏంటంటే .. డిజిటల్ కరెన్సీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే రిజర్వ్ బ్యాంకుతో కలిసి పని చేస్తోంది. ఆ ప్రణాళికల్లో భాగంగానే ఈ-రూపీ ని ప్రవేశపెట్టింది. అయితే ఆ రెండింటికీ మధ్య తేడాలు ఉన్నాయి. ఈ-రూపీ అనేది నిర్దేశిత ప్రయోజనాలకే వాడుకునే సదుపాయం ఉంది. వర్చువల్ మనీతో పోలిస్తే ఇది విభిన్నం. ఈ-రూపీ వౌచర్ బేస్డ్ పేమెంట్ సిస్టంగా ఉండనుంది. వౌచర్ను నిర్దిష్టమైన అవసరం కోసమే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. రిజర్వ్ బ్యాంకుతో కలిసి డిజిటల్ కరెన్సీ జారీకి ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పింది. ప్రస్తుతమున్న రూపాయి విలువతో సమానంగా నోట్లు కాకుండా డిజిటల్ రూపంలో డబ్బు విడుదల చేయాలనేది కేంద్రం ఆలోచన. తద్వారా పేపర్ రూపంలో ఉన్న డబ్బును క్రమంగా తగ్గించాలని గవర్నమెంట్ అనుకుంటోంది.
Tags:    

Similar News