బీఫ్ తిన్నందుకే కేర‌ళ‌ను దేవుడు శిక్షించాడు

Update: 2018-08-19 12:43 GMT
దేవ‌భూమిగా పేరొందిన  కేర‌ళ అత‌లాకుత‌లం అయిపోతున్న సంగ‌తి తెలిసిందే. భారీ వర్షాలతో 3.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వీరికి 3,026 సహాయక శిబిరాల్లో రక్షణ కల్పించారు. 40వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వెయ్యికి పైగా గృహాలు పూర్తిగా - 26వేల గృహాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 137 వంతెనలు కొట్టుకుపోయాయి.16వేల కిలోమీటర్ల పీడబ్ల్యూడీ రోడ్లు దెబ్బతిన్నాయి. 82వేల కిలోమీటర్ల స్థానిక రోడ్లు నామరూపాల్లేకుండా పోయాయి. మొత్తంగా సుమారు రూ.25వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు లెక్క‌లు తేలుతున్నాయి.

ఇలా వ‌రద ముంపులో చిక్కుకొని క్షణమొక యుగంలో గడుపుతున్న కేర‌ళ‌ను సాయం చేయడానికి ఎంతో మంది ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కేరళకు సాయం చేయాలని కోరుతున్న వాళ్ల సంఖ్య కూడా భారీగానే ఉంది. అయితే అదే సమయంలో కొందరు తమ విద్వేషాన్ని కూడా అదే సోషల్ మీడియా వేదికగా వెదజల్లుతున్నారు. వరదల్లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్న వాళ్లలో నైతిక స్థైర్యాన్ని నింపాల్సింది పోయి.. వాళ్లపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. మూఢ విశ్వాసాలను గుడ్డిగా నమ్మే కొందరు వ్యక్తులు ట్విటర్‌ లో కేరళీయుల‌పై మండిపడుతున్నారు. మీరు బీఫ్ తిన్నందుకే ఆ దేవుడు మిమ్మల్ని శిక్షించాడని - ఫలితమే ఇప్పుడీ దుస్థితి అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. దేవభూమిలో బీఫ్ తినే వాళ్ల సంఖ్య పెరిగిపోవడం దేవుళ్లను కూడా ఆగ్రహానికి గురిచేసినట్లు ట్వీట్లు చేస్తున్నారు. ఆవు మాంసం తినేవాళ్లకు సాయం చేయడమేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. వాళ్లకు సాయం చేయడానికి వెళ్లినా బీఫ్ కర్రీ ఎక్కడ అని అడుగుతారని మరో యూజర్ ఎగతాళి చేశాడు.
Tags:    

Similar News