దీదీ.. ఇదేం ప‌ద్ధ‌తి? ఈసీ ఆగ్ర‌హం.. నోటీసులు జారీ!

Update: 2021-04-09 08:00 GMT
ప‌శ్చిమ బెంగాల్ ఒక‌ప్పుడు క‌మ్యూనిస్టుల కంచుకోట‌. ఆ కోట‌ను మ‌మ‌తా బెన‌ర్జీ బ‌ద్ద‌లు కొట్టారు. వ‌రుస‌గా రెండు సార్లు గెలిచిన దీదీ.. హ్యాట్రిక్ విజ‌యం సాధించ‌డానికి తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. అయితే.. బెంగాల్లో పాగా వేయ‌డానికి ఎన్నో ద‌శాబ్దాలుగా ఎదురు చూస్తున్న బీజేపీ.. ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాల‌న్న‌ట్టుగా పోరాటం చేస్తోంది.

నువ్వా? నేనా? అన్న‌ట్టుగా సాగుతున్న పోరాటంలో.. నేత‌ల వ్యాఖ్య‌లు శృతి మించుతున్నాయి. ఇటీవ‌ల మ‌త ప్రాతిప‌దిక‌న ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేశారన్న ఫిర్యాదుపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఎన్నిక‌ల సంఘం మ‌మ‌తా బెన‌ర్జీకి ఆదేశాలు జారీచేసింది. తాజాగా.. మరోసారి నోటీసులు జారీచేసిన‌ట్టు స‌మాచారం.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఏప్రిల్ 7 మాట్లాడిన మ‌మ‌త‌.. కేంద్ర బ‌ల‌గాల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు స‌మాచారం. మ‌హిళ‌ల‌ను ఓటు వేయ‌కుండా కేంద్ర బ‌ల‌గాలు అడ్డుకుంటున్నాయ‌ని మ‌మ‌త వ్యా‌ఖ్యానించిన‌ట్టు స‌మాచారం. ‘‘సెంట్రల్ ఫోర్స్ ఎవరి ఆదేశాల మేర‌కు ప‌నిచేస్తున్నాయో తెలుసు. మా త‌ల్లులు, సోద‌రీమ‌ణుల‌పై మీ లాఠీ దెబ్బ‌ప‌డితే.. వాళ్లు క‌త్తి తీస్తారు. ఓటింగ్ కేంద్రంలోకి ప్రవేశించకుండా చేస్తే.. వాల్లు తిరుగుబాటు చేస్తారు.’’ అని మమత అన్నట్టుగా ప్రచారం సాగుతోంది.

ఈ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ చేసిన ఫిర్యాదు మేర‌కు ఈసీ స్పందించిన‌ట్టు స‌మాచారం. నిరాధార‌మైన ఆరోప‌ణ‌లతో కేంద్ర బ‌లాగ‌ల‌ను దుర్భాష‌లాడ‌టం స‌రికాదని, బెంగాల్ పోలీసులు - సెంట్ర‌ల్ ఫోర్స్ మ‌ధ్య చీల‌క తేవ‌డానికి మ‌మ‌త ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఎన్నిక‌ల సంఘం వ్యాఖ్యానించిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వ్యాఖ్య‌ల‌పై రెండు రోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని మ‌మ‌త‌ను ఆదేశించిన‌ట్టుగా తెలుస్తోంది.
Tags:    

Similar News