బలరాం నాయక్ చేసిన తప్పేంటి? మూడేళ్ల వేటు ఎందుకు పడింది?

Update: 2021-06-24 03:32 GMT
తప్పు అనాలా? పొరపాటు అనాలా? నిర్లక్ష్యం అనాలా? అన్నది అర్థం కాదు. కారణం ఏదైనా.. మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ తన తప్పునకు భారీ మూల్యన్ని చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు చేయటం.. ఆ వెంటనే అలెర్ట్ అవుతూ అటు పార్టీలు కానీ.. ఇటు నేతలు కానీ జాగ్రత్తలు తీసుకుంటారు. మరి.. బలరాం నాయక్ విషయంలో ఏం జరిగిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఉమ్మడి రాష్ట్రం (2009)లో కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రధాని మన్మోహన్ మంత్రి వర్గంలో కేంద్రమంత్రిగా వ్యవహరించారు. ఆయనపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. మూడేళ్ల పాటు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా నిర్ణయం తీసుకుంది. అంత తీవ్రమైన నిర్ణయాన్ని ఈసీ ఎందుకు తీసుకుందన్న విషయంలోకి వెళితే ఆశ్చర్యకర వాస్తవం ఒకటి బయటకు వస్తుంది.

ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఎవరైనా సరే.. నిర్ణీత వ్యవధిలోపు ఎన్నికల సందర్భంగా తాము చేసిన వ్యయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి వెల్లడించాల్సి ఉంటుంది. బలరాం నాయక్ ఈ విషయంలో తప్పు చేశారు. తన ఎన్నికల ఖర్చు వివరాల్ని ఆయన ఈసీకి సమర్పించలేదు. దీంతో.. ఆయనపై మూడేళ్ల పాటు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేలా వేటు వేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. నేతలకు ఈ ఉదంతం ఒక హెచ్చరికగా ఉంటుందనటంలో సందేహం లేదు. 
Tags:    

Similar News