పైసా పెట్టలేదు కానీ బ్యాంకుల నుంచి రూ.1768 కోట్లు తీసుకున్నాడు

Update: 2020-01-17 04:30 GMT
విన్నంతనే విస్తుపోయేలా ఉండే నిజం. పైసా పెట్టుబడి పెట్టకుండా వ్యాపారానికి రూ.1768 కోట్లు అప్పు చేసిన లియో మెరీడియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటే హోటల్స్ లిమిటెడ్ యవ్వారం ఇప్పుడు షాకింగ్ మారింది. పచ్చి మోసం.. దగా లాంటి పదాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని కళ్లకు కట్టేలా చూపించి.. బ్యాంకులకు టోపీ పెట్టి వేలాది కోట్లను లాగేసిన వైనం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. తప్పుడు పత్రాలతో..కల్లిబుల్లి కబుర్లు ఎన్ని చెబితే మాత్రం ఇంత భారీ మొత్తాన్ని బ్యాంకులు ఏ విధంగా ఇచ్చాయన్నది ఇప్పుడో సందేహంగా మారింది.

ఈ కేసులో నిందితులైన జీఎస్ చక్రవర్తి రాజు.. అతని ప్రధాన అనుచరుడు ఏవీ ప్రసాద్ లను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం 2002 కింద అరెస్టు చేశారు. అదే సమయంలో అతనికి సన్నిహితంగా ఉండే వారి నుంచి రూ.250.39 కోట్లను ఈడీ అటాచ్ చేసింది.

ఇంత భారీ మోసాన్ని ఎలా చేశారు? అన్ని బ్యాంకుల్ని ఎలా బురిడీ కొట్టారన్నది చూస్తే.. తప్పుడు లేఅవుట్ తయారు చేసి దాన్ని ప్లాట్లుగా మార్చి.. 315 మందికి అమ్మారు. లే అవుట్ లో అమ్మేసిన ప్లాట్లనే రిసార్టు ప్రాజెక్టు అంటూ బ్యాంకుల్లో అదే స్థలాన్ని పెట్టి కోట్లు దండుకున్నారు. బ్యాంకుల్లోని ముఖ్య అధికారుల్ని పక్కదారి పట్టించటంతో పాటు.. ఎక్కడికక్కడ ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేయటం ద్వారా బ్యాంకులను బోల్తా కొట్టించినట్లుగా అంచనా వేస్తున్నారు.

ఈడీ అధికారుల బృందం దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి.రూ.1,768 కోట్ల వ్యాపారానికి ఇంతవరకూ ఎలాంటి బ్యాలెన్స్‌ షీట్‌ కూడా నిర్వహించకపోవడం గమనార్హం. వారు ఏ ప్రాజెక్టు చేపట్టారు? ఎన్ని నిర్మాణాలు జరిపారు? అన్న విషయాలపై కనీసం ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు. ఇదంతా చూసినప్పుడు బ్యాంకు అధికారుల్ని బురిడీ కొట్టించి.. తమ ప్రయోజనాల్ని ఎలా తీర్చుకున్నారన్నది ఇట్టే అర్థమైపోతుంది. అంతేకాదు.. తమకున్న వ్యక్తిగత పలుకుబడితో బినామీ ఆస్తుల్ని సంపాదించి.. వాటిని బ్యాంకుల్లో పెట్టి కోట్లు దండుకున్న వైనం షాకింగ్ గా మారింది. ఏమైనా.. తప్పుడు పత్రాలతో బ్యాంకులను ఇంత భారీగా మోసగించొచ్చా? అన్న విషయం మాత్రం తాజా అరెస్టులతో స్పష్టమవుతుందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News