250 ఎకరాల ‘జగన్ భూముల’పై ఆంక్షలు

Update: 2015-07-17 04:10 GMT
ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు సంబంధించి తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విధించిన ఆంక్షలు ఆయనకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. తాజాగా ఈడీ ఆంక్షల కారణంగా 250 ఎకరాల భూమి విషయంలో  జగన్ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టే వీల్లేని పరిస్థితి.

రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఈ 250 ఎకరాల భూమికి సంబంధించి గతంలోనే జఫ్తు చేయాలని ఆదేశించారు. తాజాగా.. ఈ భూములకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు సాగకుండా చూడాలని ఈడీ సూచించింది. ఇందుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా రెవెన్యూ.. రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. గత ఫిబ్రవరిలోనే జప్తునకు సంబంధించిన ఆదేశాలు ఇచ్చారు.

క్విడ్ ప్రోకో కేసులో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ 250 ఎకరాల విలువ రూ.53 కోట్ల మేర ఉంటుందని చెబుతున్నారు. అయితే.. ఈ విలువ మొత్తం నాటి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా చెబుతున్నది. తాజా లెక్కలతో తీసుకుంటే.. ఈ విలువ మరింత భారీగా ఉంటుంది. కొద్దికాలంగా జగన్ కేసులకు సంబంధించిన విచారణ నత్తనడకన సాగుతుందన్న మాట వినిపిస్తున్న క్రమంలో.. కేసుల విచారణ త్వరగా సాగాలంటూ ఈడీ ఆదేశాలు జారీ చేయటం గమనార్హం. మరి.. ఈ నిర్ణయం రోటీన్ లో భాగంగా తీసుకున్నవా? లేక..జగన్ కు కొత్త చిక్కులు సృష్టించేవా అన్నది తేలాల్సి ఉంది.
Tags:    

Similar News