ఆ గ్రామంలో ఈగ సినిమా రిపీట్‌!

Update: 2022-07-23 01:30 GMT
మీరంతా రాజమౌళి దర్శకత్వంలో నాని, సమంత హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈగ సినిమాను చూసే ఉంటారు. అందులో విలన్‌ సుదీప్‌... హీరో నానిని చంపేస్తే నాని ఈగగా మారి విలన్‌పై ప్రతీకారం తీర్చుకుంటాడు. ఆ సినిమా అంతా ఈగ ఒక వ్యక్తిపై ఎలా పగ తీర్చుకుందో కళ్లకు కట్టిన ట్టు విజువల్‌ ఎఫెక్ట్స్‌తో రాజమౌళి మాయ చేశారు.

ఇప్పుడు ఇదే మాదిరిగా లక్షల సంఖ్యలో ఈగలు ఒక గ్రామాన్ని టార్గెట్‌ చేసుకుని చుక్కలు చూపిస్తున్నాయని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం నగరేపల్లి గ్రామంలో ప్రజలు ఈగలతో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ఏదో ఆ గ్రామంపై పగబట్టినట్టు కొన్ని లక్షలు ఈగలు గ్రామంపై దండయాత్రకొచ్చినట్టు వస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారని సమాచారం. రాజమౌళి ఈగ సినిమాలోని ఒక ఈగ విలన్‌ను ఇబ్బందిపెడితే.. నగరేపల్లిలో మాత్రం లక్షల సంఖ్యలో ఈగలు గ్రామంపై దండయాత్రకొస్తున్నాయని చెబుతున్నారు.

నగరేపల్లి గ్రామంలో 150 కుటుంబాలు ఉంటున్నాయి. వీరంతా రైతులు, వ్యవసాయ కూలీ కుటుంబాలే. లక్షల కొద్దీ ఈగలు గ్రామాన్ని చుట్టుముట్టి దండయాత్ర చేస్తూ ప్రజలను ఏ పని చేసుకోనివ్వడం లేదని చెబుతున్నారు. ఈ ఈగలమోత తట్టుకోలేక ఆ ఊరి ప్రజలు అధికారులను ఆశ్రయించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామానికి ఎవరు వెళ్ళినా ఈగల బెడద గురించి చెబుతూ ఆ ఊరి లబోదిబోమంటున్నారట.

మరోవైపు ఈ ఈగలతో గ్రామస్తులు అనారోగ్యం బారిన పడుతున్నారు. అయితే గ్రామంలో ఈగల బెడద ఎక్కువ కావడానికి, గ్రామానికి సమీపంలో ఉన్న కోళ్లఫారాలు కారణమని గ్రామస్తులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కోళ్ల ఫారాల నుండి వచ్చే వ్యర్థాలతోనే ఈగల వ్యాప్తి అధికం అయిందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇళ్లలో తినుబండారాలు, ఆహార పదార్థాలు వండీ వండగానే ఈగలు వచ్చేస్తున్నాయని చెబుతున్నారు. గ్రామంలో ఏదైనా శుభకార్యం చేసుకోవాలన్నా, వేడుక చేసుకోవాలన్న ప్రజలు ఈగల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. చివరకు తాము నిద్రించే సమయంలో కూడా ఈగలు తమను వదిలిపెట్టడం లేదని... వీటివల్ల కంటి మీద కునుకు ఉండటం లేదని గ్రామ ప్రజలు అధికారులకు నివేదించారు.

గ్రామంలో ఇళ్లు విడిచి ఎక్కడికి వెళ్ళినా, చివరకు పొలం పనులకు వెళ్లినా అక్కడ కూడా ఈగ... ఈగ.. ఈగ... అని భయపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags:    

Similar News