హైజాక్ ఎందుకు చేశాడో తెలిస్తే షాకవుతారు

Update: 2016-03-29 11:44 GMT
ఈ రోజు ఉదయం నుంచి ఒకటే కలకలం.. 81 మంది ప్రయాణికులతో ఉన్న ఈజిప్టు విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారన్న వార్త అంతర్జాతీయ సమాజాన్ని కలవరపాటుకు గురి చేసింది. ఇది ఐసిస్ ఉగ్రవాదుల పనే అని.. బందీల్లో ఎంతమంది ప్రాణాలు తీస్తారో.. ఏ డిమాండ్లు విధిస్తారో.. అని అందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కానీ తీరా చూస్తే ఈ హైజాక్ కు కుట్ర పన్నింది ఉగ్రవాదులు కాదని తేలింది. హైజాకర్ ఉగ్రవాది కాదని.. అలెగ్జాండ్రియా యూనివర్శిటీలో అతను ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడని వెల్లడైంది. హైజాక్ జరిగిన దాదాపు నాలుగు గంటల తర్వాత అసలు విషయం బయటికి వచ్చింది.

హైజాక్ జరిగిన తర్వాత బందీల్లోంచి ఆడవాళ్లను.. పిల్లల్ని వదిలేసినపుడే కొందరికి అనుమానాలు తలెత్తాయి. ఉగ్రవాదులు ఇంత ఉదారంగా వ్యవహరిస్తారా అన్న సందేహం కలిగింది. ఈలోపు అధికారులు విమానాశ్రయంలో పెద్ద ఎత్తున రెస్క్యూ బలగాల్ని మోహరించింది. ఐతే హైజాకర్ల డిమాండ్లు ఏంటో చాలా సేపు తెలియక అధికారులు ఉత్కంఠతో ఎదురు చూశారు. ఐతే భార్య వదిలేసిన ఓ ప్రొఫెసర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిసి ఆశ్చర్యపోవడంతో పాటు.. కొంత వరకు ఊపిరి పీల్చుకున్నారు. తన భార్యను తక్షణం తీసుకొచ్చి తనకు చూపించాలని హైజాకర్ డిమాండ్ చేయడం విశేషం. ఈ హైజాకింగ్ డ్రామాకు ఉగ్రవాదంతో సంబంధం లేదని సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనాస్టాసియాడెస్ ప్రకటించారు. అధికారులతో చర్చల అనంతరం బందీలందరినీ హైజాకర్ వదిలేసినట్లు తెలుస్తోంది. కాసేపట్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడొచ్చు.
Tags:    

Similar News