ప్రధానికి షాకిచ్చిన ఎన్నికల సంఘం

Update: 2021-03-04 07:30 GMT
ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ పథకాల హోర్డింగులను తొలగించాలని నిర్ణయించింది. పెట్రోల్ బంకుల వద్ద ప్రధాని ఫోటోతోపాటు.. గ్యాస్ సిలిండర్ రాయితీ వదులుకోవాలన్న ప్రకటనతో పాటు.. కేంద్ర ప్రభుత్వాలు చేపట్టే పథకాలకు సంబంధించిన భారీ హోర్డింగులు ఉంటాయి. వీటిపై అభ్యంతరం వ్యక్తం చేసింది పశ్చిమబెంగాల్ అధికారపక్షం.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో.. పశ్చిమబెంగాల్ అధికారపక్షానికి.. కేంద్రానికి మధ్య సరైన సంబంధాలు లేకపోవటం తెలిసిందే. రాజకీయంగా ఉప్పు..నిప్పులా ఉండే వీరి మధ్య బెంగాల్ లో ఎన్నికల ఫైట్ ఓ రేంజ్లో సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు.. తమదైన రీతిలో ఎత్తులు వేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగాల్ లో  అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది.

అదే సమయంలో కమలనాథులకు అలాంటి అవకాశం ఇవ్వకుండా చేయాలని బెంగాల్ సీఎం మమత గట్టి పట్టుదలతో ఉన్నారు. దీంతో.. ఏ చిన్న అవకాశం ఉన్నా.. ప్రత్యర్థిని వదలకుండా వెంట పడుతున్న ఈ రెండు పార్టీల తీరుతో బెంగాల్ రాజకీయ రసవత్తరంగా మారింది. తాజాగా పెట్రోల్ బంకుల వద్ద మోడీ ఫ్లెక్సీల్ని తీయించే విషయంలో తాజాగా దీదీ పార్టీ సక్సెస్ అయ్యింది. ఆ పార్టీ వినతిని ఎన్నికల సంఘం మన్నించటమే కాదు.. పెట్రోల్ బంకుల వద్ద ప్రధాని మోడీ ఫోటోలు ఉన్న హోర్డింగుల్నితీసివేయాలని ఆదేశించారు. మరి.. దీనికి బీజేపీ ఎలాంటి ప్లానింగ్ చేస్తుందో చూడాలి.
Tags:    

Similar News