సార్వ‌త్రికానికి థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ ఈవీఎంలు రెఢీ!

Update: 2018-06-26 04:53 GMT
ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయా?  లేదా?  అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయ పార్టీల మూడ్ అంతా ముంద‌స్తు మీదే ఉంది. ఇందుకు త‌గ్గ‌ట్లే ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు సంకేతాలు ఇస్తున్నాయి. ఇదిలా ఉంటే.. వీటితో సంబంధం లేన‌ట్లుగా ఎన్నిక‌ల సంఘం త‌న ప‌ని తాను చేసుకుపోతోంది. దేశంలో ఎప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హించినా.. అత్యాధునిక ఈవీఎంలు వినియోగించేందుకు వీలుగా క‌స‌ర‌త్తు చేస్తోంది. దీనికి త‌గ్గ‌ట్లే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈసారి సార్వ‌త్రికానికి థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ ఓటింగ్ యంత్రాల్ని వినియోగించాల‌ని నిర్ణ‌యించారు. మ‌రో కీల‌క‌మైన నిర్ణ‌యం ఏమిటంటే 2014కు ముందు త‌యారు చేసిన ఓటింగ్ యంత్రాల్ని వాడ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించారు. అంతేకాదు.. ఓటు వేసిన త‌ర్వాత ఓటు వేశామా?  లేదా?  అన్న‌ది తేల్చేందుకు ర‌సీదు ఇచ్చే యంత్రాలతో అనుసంధానం చేయాల‌ని నిర్ణ‌యించారు.

దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించినా ఇబ్బంది లేకుండా ఉండేలా అవ‌స‌ర‌మైన ఈవీఎంల‌ను సిద్ధం చేస్తున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు.. ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించినా ఇబ్బంది లేకుండా ఉండేలా ఈవీఎంలను త‌యారు చేయిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం సుమారు 40 లక్ష‌ల థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ ఈవీఎంల‌ను రూపొందిస్తున్నారు. వీట‌న్నింటిని నవంబ‌రు నాటికి సిద్ధం చేయాల‌ని నిర్ణ‌యించారు.

అదే స‌మ‌యంలో మాస్ట‌ర్ ట్రైన‌ర్ల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మానికి ఎన్నిక‌ల సంఘం రెఢీ అయ్యింది. వ‌చ్చే నెల మొద‌టివారంలో అన్ని రాష్ట్రాల్లో శిక్ష‌ణ షురూ చేయాల‌ని భావిస్తున్నారు.

2014లో త‌యారుచేసిన  థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ ఈవీఎంల‌ను ఎన్నిక‌ల సంఘం ప్ర‌యోగాత్మ‌కంగా తొలిసారి తెలంగాణ‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల ఎన్నిక‌ల సంద‌ర్భంగా వాడారు. ఇటీవ‌ల జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లోనూ వీటినే వినియోగించారు. వాడ‌కంలో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌క‌పోవ‌టంతో వీటినే వినియోగించాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల సంద‌ర్భంగా కొన్ని ఈవీఎంలు మొరాయించ‌టంతో.. అలాంటి వాటికి కార‌ణాలు ఏమిట‌న్న‌ది అధ్య‌య‌నం చేస్తున్నారు.

మ‌రోవైపు.. దేశంలో భిన్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లోనూ ఈవీఎంలు ప‌ని తీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. రాజ‌స్థాన్ లాంటి ఎక్కువ ఉష్ణోగ్ర‌త‌లు ఉండే ప్రాంతం.. అందుకు పూర్తి భిన్నంగా అత్యంత శీత‌లంగా ఉండే ల‌డ్హ‌ఖ్ ప్రాంతంలోనూ ఈవీఎంలు మొరాయించ‌కుండా ఉండేలా ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈవీఎంల వినియోగంపై పెద్ద ఎత్తున వ‌చ్చే ఫిర్యాదుల నేప‌థ్యంలో అలాంటివి చోటు చేసుకోకుండా ఉండ‌టానికి వీలుగా ఎన్నిక‌ల సంఘం జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ ఈవీఎంల ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ను ఢిల్లీ.. ముంబ‌యి.. బిలాయ్ ఐఐటీ ప్రొఫెస‌ర్ల బృందానికి అప్ప‌జెప్పారు. అంతేకాదు.. ప్ర‌తి ఈవీఎంల‌కు సంబంధించి ఎవ‌రు ఏ స్థాయిలో వాటిని రూపొందించారు.. ప‌ర్య‌వేక్షించార‌న్న వివ‌రాల్ని కంప్యూట‌రైజ్ చేశారు. ఏదైనా అక్ర‌మం జ‌రిగింద‌న్న ఆరోప‌ణ వ‌చ్చిన ప‌క్షంలో.. అందుకు ఎవ‌రు బాధ్యుల‌న్న విష‌యాన్ని గుర్తించేందుకు వీలుగా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు
Tags:    

Similar News